వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోంది అంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య…

‘వివేకా హత్య కేసు నిందితులెవరో జగన్‌కు తెలుసు’

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు. అసలు నిందితుల్ని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్న వర్ల. నిందుతులు ఎవరో వైఎస్ జగన్‌కు తెలుసన్న టీడీపీ నేత.

ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించిన ఆయన.. నిందితులెవరో జగన్‌కు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి బాబాయి హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామయ్య.. సంచలన ఆరోపణలు చేశారు.

వివేకా హత్యకేసులో సంబంధం లేని వారిని నిందితులుగా చూపించబోతున్నారన్నారు వర్ల. అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో వివేకా కుమార్తె సునీత.. ఎలక్షన్ కమిషన్‌ను కలిశారని.. కేసు సీబీఐకి ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు ఆమె ఎందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం లేదన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కేసుని సీబీఐకి ఇవ్వాలన్నారని.. ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదో చెప్పాలన్నారు

జగన్ ఈ కేసును సీబీఐకి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని రామయ్య ప్రశ్నించారు.

సీఎం చిన్న సంతకం చాలు.. నేరస్థులు ఎవరో తేల్చేస్తారు.. ప్రభుత్వ ఉద్దేశం అసలు నిందితుల్ని దాచిపెట్టి.. నకిలీవాళ్లను చూపించడమేనని ఆరోపించారు.

సొంత బాబాయి హత్యకేసు సీబీఐకి అప్పగిస్తే అసలు నిజాలు బయటకొస్తాయనే భయమన్నారు.

ఈ కేసులో అసలు నిందితులు ఎవరో పులివెందులలో ఏ తలుపును కొట్టినా చెబుతారన్నారు వర్ల రామయ్య.

వివేకా హత్య కేసు విషయంలో తాత్సారం ఎందుకో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు వర్ల.

అసలు నిందితుల్ని దాచి అమాయకుల్ని బలి చేయాలని చూస్తున్నారని.. పోలీసులు ఈ కేసులో నిస్పక్షపాతంగా వ్యవహరించి.. నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి బాబాయి కేసులో ఇలా జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే వివేకా హత్య కేసులో జరిగిన ప్రచారం సంగతిని ప్రస్తావించిన వర్ల రామయ్య.. దీని వెనుక ఎవరి హస్తం ఉందో చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *