పదవులన్నీ ఆ వర్గానికేనా, ఇదేం వైఖరి ఆందోళనలు

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

  • టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆవేదన…
  • తమను వాడుకుని వదిలేసే ధోరణిపై మండిపాటు
  • ర్టీలోనైనా, నామినేటెడ్‌ పదవుల్లోనైనా తనవారికే కట్టబెట్టిన సీఎం చంద్రబాబు
  • తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్,ఐటీ వింగ్‌ సారథ్యం తనవారికే

20 సూత్రాల పథకం,శాప్‌ ఛైర్మన్ల లాంటి పదవులన్నీ ‘సొంత’ ఖాతాలోనే.
పేదరికమే తన కులమంటూ తరచూ సినీ డైలాగులు వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు నిజానికి అధికారం చేపట్టిన నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో పార్టీ, ప్రభుత్వంలో తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని టీడీపీకే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్లు చివరికి పార్టీ పదవుల్లోనూ సీఎం తన సొంత సామాజిక వర్గానికే అగ్రతాంబూలం కల్పించారు. తనవర్గం వారికివ్వగా మిగిలిన పదవులనే ఇతరులకు బిస్కెట్ల మాదిరిగా వేశారనే అభిప్రాయం పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీలో సీఎం సామాజికవర్గం మినహా మిగతావారు కీలక పదవి దక్కించుకోవాలంటే మోకాళ్లు అరిగిపోయేలా తిరగాల్సిందేనని విజయవాడకు చెందిన ఒక బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ అంత తిరిగినా గ్యారంటీ ఉండదని, సీఎం సామాజిక వర్గం అండదండలు ఉంటేనే పదవి వరిస్తుందనే అభిప్రాయం టీడీపీలో దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకూ వ్యక్తమవుతోంది.

శాసనమండలిలోనూ 40 శాతం తనవారికే
శాసనమండలిలో టీడీపీకి 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా సీఎం సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్, వైవీబీ రాజేంద్రపసాద్, నారా లోకేష్, గాలి సరస్వతమ్మ, వీవీవీ చౌదరి, కరణం బలరామకృష్ణమూర్తి, దొరబాబు (బీఎన్‌ రాజసింహులు), టీడీ జనార్థన్‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కేశవ్‌ను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండామండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టారు. లోకేష్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రిని చేసి కీలక శాఖలిచ్చారు. వీవీవీ చౌదరి, టీడీ జనార్థన్‌లు చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యులు. పార్టీ పదవులు, ఇతర వ్యవహారాలన్నీ వీరే చక్కబెడతారు. అందువల్లే వారికి ప్రజలతో సంబంధం లేకపోయినా ఎమ్మెల్సీలను చేశారు. కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి చంద్రబాబుకు బంధువు, ఆప్తుడు. ఇలా శాసన మండలిలో 40 శాతం మంది తన మనుషులకే చంద్రబాబు అవకాశం కల్పించారు.

ఐదుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తనవారే
ప్రస్తుతం టీడీపీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులుంటే అందులో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌లు చంద్రబాబు కోటగిరీలో కీలక వ్యక్తులు. కనకమేడల కోసం దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్యను చంద్రబాబు పక్కనబెట్టారు. దళితుల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారే తప్ప ఆ వర్గంపై బాబుకు ఏమాత్రం అభిమానం లేదని చెబుతారు. నిజంగానే అభిమానం ఉంటే రామయ్యను రాజ్యసభకు పంపి ఉండేవారని పార్టీలోనే చాలా రోజులు చర్చ జరిగింది. ఇక ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావు సైతం సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

తెలుగు యువత, కార్పొరేషన్లూ వారికే..
పార్టీ పదవుల్లో చంద్రబాబు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఇటీవలే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి స్థానంలో తన వర్గానికే చెందిన దేవినేని అవినాష్‌ను కూర్చోబెట్టారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ బ్రహ్మం చౌదరి, ఐటీ వింగ్‌ బ్రహ్మం చౌదరి, లీగల్‌ సెల్‌ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, స్వచ్ఛాంద్ర మిషన్‌ ఛైర్మన్‌ సీఎల్‌ వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దివి శివరాం, గిడ్డంగుల సంస్థ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ శేషసాయిబాబు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, శ్యాప్‌ ఛైర్మన్‌ అంకమ్మ చౌదరి, వికలాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తన సామాజిక వర్గానికి చెందిన కోటేశ్వరరావును నియమించారు.

సిఫారసు లేఖలు ఉంటేనే..
పదవుల పంపిణీలో చంద్రబాబు తనవారికే ప్రాధాన్యమిస్తుండడంపై పార్టీలో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పైస్థాయిలో ముఖ్య నాయకులకు అరకొరగా పదవులిచ్చి మిగిలిన వాళ్ల నోళ్లు మూయించారు. పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న తమను గుర్తించడంలేదని, ఐదేళ్లుగా ఎదురు చూపులతోనే కాలం గడిచిపోయిందని పలువురు వాపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం కిందిస్థాయి నాయకులకు సూచించడంతో వేల సంఖ్యలో వచ్చాయి. అయితే వీటిని పక్కనపడేసి స్థానిక ఎమ్మెల్యే / పార్టీ ఇన్‌ఛార్జి సిఫారసు చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంతేకాదు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు లేఖలు కూడా అడుగుతున్నారు. ఈ పదవులన్నీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్‌ సూచనల ప్రకారమే పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో 16 మార్కెట్‌ కమిటీలకుగానూ 13 పదవులను సీఎం సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం గమనార్హం.

తప్పనిసరి అయితేనే…
టీడీపీలో కులానికే ప్రథమ ప్రాధాన్యమనే విషయం జగమెరిగిన సత్యమని పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు వల్లించినా పాటించేది మాత్రం కుల సూత్రాన్నే అని స్పష్టం చేస్తున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారైతే సీఎంవోలో అయినా, పార్టీ కార్యాలయమైనా, చంద్రబాబు ఇంటి వద్దైనా ఆత్మీయత కనపడుతుంది. మిగిలిన వారి పట్ల అవసరం, పరిస్థితులను బట్టి కపట ప్రేమను ఒలకబోస్తుంటారని పార్టీకి చెందిన ఇతర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *