TDP army sharing anonymous letter for CBN

నాయుడు గారూ… మీరు మారాలి సర్… “Will He”?

మీకు గుర్తుందో లేదో 1996లో అనుకుంటా.. మీరు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో జరిగిన ఒక మూడు సంఘటనల గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం సార్…

  1. ఒకసారి ఆకస్మిక తనిఖీ అని వెళ్ళి హైదరాబాద్ లో ఒక ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయడంలేదని అధికారులమీద కోప్పడి….”మళ్ళీ ఇంకోసారి నేను తనిఖీకి వచ్చినప్పుడు ఇలానే ఉంటే మిమ్మల్ని కూడా అదే డ్రైనేజీ లో ముంచుతా” అన్నారు. ఆ దెబ్బకి అధికారుల్లో, ఎం.ఎల్.ఏల్లో మీరంటే ఒక భయం మొదలయింది.
  2. ఇంకోసారి నక్సల్స్ ప్రభావిత ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనకి వచ్చినప్పుడు అక్కడి పోలీసులు ‘వద్దు సార్ నక్సల్స్ హిట్ లిస్ట్ లో మీరు కూడా వున్నారు అంటే…’ “నేనసలు వచ్చిందే వాళ్ళని మార్చడానికి” అని ధైర్యంగా అడుగు ముందుకేశారు.
  3. మరో సందర్భంలో అప్పటి కేంద్ర హోమ్ మంత్రి అద్వానీ గారు రాష్ట్ర పర్యటనకి వస్తున్నప్పుడు “సార్ అద్వానీ గారి మీద, మీమీద ఉగ్రదాడి జరగొచ్చని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉంది” అని పోలీసులు హెచ్చరించినప్పుడు “ఏం వాళ్ళ తుపాకుల్లోనే బుల్లెట్లు ఉన్నాయా…. మీ తుపాకుల్లో లేవా” అని ఒక్క అడుగుకూడా వెనక్కి వేయకుండా అద్వానీగారి పర్యటన దిగ్విజయంగా ముగించారు.

ఈ దూకుడు… ఈ తెగువకి తోడు రాష్ట్ర అభివృద్ధి పట్ల మీ చిత్తశుద్ధిని చూసిన ప్రజలు… మీమీద అప్పట్లో అన్న ఎన్.టి.ఆర్ ని పదవీచ్యుతుడ్ని చేశారనే విమర్శ ఉన్నా… మరో ఆలోచనలేకుండా 1999లో మళ్ళీ మీకే పట్టంకట్టారు. మరి ఇప్పుడు ఆ దూకుడు… ఆ తెగువ ఏమయ్యాయి సార్? అరె చివరికి నిన్నగాక మొన్న పార్టీ పెట్టి తెలంగాణలో పోటీచేయడానికి భయపడిన వాళ్ళు… అసలు ఇంకా పార్టీపెట్టని వాళ్ళు కూడా ఆంధ్రాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము అంటుంటే ఆంధ్ర రాజకీయాలు అంత చులకన అయ్యాయా అనిపిస్తుంది.

మిమ్మల్ని విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారు మంత్రులు, ఏం.ఎల్.ఏలు, ఎం.పి లు? లాభంలేదు సార్… దొంగలు పడ్డ ఆరునెలలకి అరిచినట్లు… అసలు మిమ్మల్ని విమర్శించారు అని జనాలు కూడా మర్చిపోయాక… ఎక్కడో ఒకడు మైకు పట్టుకుని… మా నాయకుడిని ఆలా అంటావా… ఇలా అంటావా అనేసి ఫొటోలకి ఫోజులిచ్చి వెళ్తాడు. బట్టలమీద మరక పడినప్పుడు వెంటనే కడిగేస్తేనే పోతుంది కానీ… రేపెప్పుడో షర్ట్ విప్పినప్పుడు కడుగుదాములే అనుకుంటే అది శాశ్వతంగా ఒక మచ్చలాగా మిగిలిపోతుంది.

అలానే మిమ్మల్ని విమర్శిస్తున్నవాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడినుంచి వస్తుందో ఆ ధైర్యాన్ని దెబ్బ తీయకపోతే… రేపు ఎక్కడో ఉత్తరాది జనాలు కూడా రైల్లో ప్రయాణం చేస్తా ఆంధ్రాలో ఎక్కడో ఒక స్టేషన్ లో ఆగినప్పుడు ఎవర్నో ఒకరిని తిట్టడం ఎందుకు మిమ్మల్నే తిడితే పోలా అని రెండుమాటలని… ఒకపులిహోర పొట్లం కొనుక్కొని వెళ్తారు. లాభం లేదు సార్… మీరు మారాలి… మీ వ్యక్తిత్వం మార్చుకోవాలి… మీరు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇంకా పుట్టని పిల్లనాయాళ్ళు కూడా మీమీద విమర్శలు చేస్తుంటే… తిప్పికొట్టకపోతే అది చివరికి తెలుగుదేశం కార్యకర్తల పౌరుషాన్ని కూడా అవమానించినట్టే అవుతుంది.

  • చంద్రబాబు అభిమాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *