రాష్ట్రం రావణకాష్టం, ఇదేనా ప్రజాస్వామ్యం.. ఢిల్లీలో చంద్రబాబు

ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ఢీల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు.

1.ఏపీలో ఎన్నికల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2.మోదీ సూచనల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు.
3.సీఈసీ సునీల్ అరోరాకు ఫిర్యాదు లేఖ అందించారు.

ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా విఫలమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు.

ఎన్నికల్లో హత్యలు జరిగినా, మహిళల మీద దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈవీఎంలు విఫలం చెందడానికి కారణమేంటని నిలదీశారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

శనివారం (ఏప్రిల్ 13) మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. ఏపీలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడారు.

పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని.. తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని ప్రజలు చెబుతున్నారని.. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా ఈసీ పట్టించుకోలేదు. తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరిగింది.

ఇదేనా ప్రజాస్వామ్యం?’ అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల వేళ ఇష్ట ప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు.

సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని చంద్రబాబు ఆరోపించారు.

ఓటేయడానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ‘దీనికి కారణం ఎవరు? ఈసీ బాధ్యత తీసుకుంటుందా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అధికారులను బదిలీలు చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ ఒక్క మాటా మాట్లాడలేదని విమర్శించారు.

‘రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయి. ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉంటా. ఈవీఎంల వ్యవహారాన్ని జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తా’ అని చంద్రబాబు అన్నారు.

వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ కోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని గుర్తు చేశారు.

బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16 గంటల సమయం పడితే.. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులు సమయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

చాలా దేశాలు పేపర్ బ్యాలెట్ వాడుతున్నాయి 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను కచ్చితంగా లెక్కించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి 6 రోజులు సమయం పడుతుందని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపిందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదన్నారు.

పేపర్‌ బ్యాలెట్‌లతో అందరికీ అవగాహన ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *