ఏడాది కాలంలో 52 బిల్లులు పాస్‌..చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్‌ చేసినట్లు..హైకోర్టులో విచారణపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానులపై హైకోర్టులో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏడాది కాలంలో 52 బిల్లులు పాస్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ తమ్మినేని సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్‌ చేసినట్లు వెల్లడించారు.

వికేంద్రీకరణ బిల్లుపై 11 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. ఈ చర్చలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 4 గంటలు, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు 2.17 గంటలు మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ సమయమే కేటాయించినట్లు తెలిపారు. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చ సరిగా జరగలేదని ప్రతిపక్షం విమర్శించడం సరికాదని హితవు పలికారు.

న్యాయ సమ్మతంగా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చామని స్పీకర్‌ తమ్మినేని తెలిపారు.

అలాగే మంత్రులను శాసన మండలికి రాకూడదని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. న్యాయస్థానాలకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, సెలక్ట్‌ కమిటీలో పెండింగ్‌ ఉందని కోర్టులో చెప్తున్నారని మండిపడ్డారు.

అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటుందని నిలదీశారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు.

సెలక్ట్ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్ జరగాలని, ఓటింగ్ జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటవుతుందని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని అసెంబ్లీలో ఎందుకు అడగలేదు? శాసన మండలిలో అడగడం వెనుక ఉద్దేశమేంటి? అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు.

1997లో శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని యనమల రూలింగ్ ఇచ్చారని, ఆయన ఇచ్చిన రూలింగే ఇప్పటికీ అమలులో ఉందని వివరించారు.

అదే యనమల ఇప్పుడు ఎలా విభేదిస్తారు? శాసనసభ నిర్ణయాలపై ఎందుకు కోర్టుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. యనమల ఆరోజు ఇచ్చిన రూలింగ్‌ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *