TDP ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ..ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షాకిచ్చింది.

అచ్చెన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

కాగా, ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితో పాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో సహా 9 మందిని అరెస్ట్‌ చేసింది.

కాగా, అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు కాబట్టి తనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు.

లేదంటే జైల్లోకి అనుమతించరని పేర్కొన్నారు. కాగా ఆరోగ్య కుదుటపడనప్పటికీ అచ్చెన్నను అక్రమంగా డిశ్చార్జి చేశారని టీడీపీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆయన డిశ్చార్జిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *