పాక్ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరణ…కమాండర్ అభినందన్

అభినందన్.. శత్రుచెరలోనూ తగ్గని మనోనిబ్బరం!

భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా మన గగనతలంలోకి పాకిస్థాన్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడంతో వాటిని వెంబడించే ప్రయత్నంలో ఓ వింగ్ కమాండర్ పాక్ మూకలకు చిక్కడంతో అతడిని స్థానికులు దారుణంగా కొట్టారు.

1.మనోనిబ్బరం చూపిన శత్రుచెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్.

2.పాక్ అధికారులు ప్రశ్నించినా ఒక్క రహస్యం కూడా వెల్లడించని పైలట్.

3.పాక్ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరణ.

బుధవారం ఉదయం పాకిస్థాన్‌ చేతికి చిక్కిన భారత్‌ వైమానిక దళ పైలట్‌ అభినందన్‌కు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో టీ తాగుతున్న అభినందన్, విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది.

తమకు చిక్కిన వింగ్ కమాండర్‌పై పాకిస్థాన్ పౌరులు విచక్షణారహితంగా దాడిచేసి కొడుతున్నట్లు ఉన్న వీడియో తొలుత బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అభినందన్, కేవలం ఆయన ఐడీ నెంబరు, పేరును మాత్రమే బయట పెట్టినట్లు వీడియోలో స్పష్టమవుతోంది.

అతడి ముఖమంతా రక్తమోడుతూ ఉండగా, ఈ వీడియోపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

జెనీవా ఒప్పందం ప్రకారం పొరుగుదేశానికి చిక్కిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని భారత్‌ పేర్కొంది.

ఈ వీడియో పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్‌ నుంచి దాన్ని తొలగించారు. కొద్ది గంటల తర్వాత పాక్‌ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది.

1.19నిమిషాలు ఉన్న ఈ వీడియోలో పైలట్‌ టీ తాగుతూ కనిపించారు. ఆయన ముఖంపై గాయాలు ఉన్నాయి.

కళ్లు బాగా ఉబ్బిపోయి కనిపించాయి. అక్కడి అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు పైలట్‌ సమాధానాలు చెప్పేందుకు నిరాకరించారు.

తనను ప్రశ్నించిన అధికారులకు ఒక్క భారత రహస్యాన్ని కూడా చెప్పకుండా తన మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. పాక్ అధికారి అభినందన్‌ను అడిగిన ప్రశ్నలివే…

పాక్ అధికారి: నీ పేరు ఏంటి?
అభినందన్: అభినందన్.

పాక్ అధికారి: నీకు ఈ రోజు బాగా గడించిందని అనుకుంటున్నాను.

అభినందన్: అవును… నేను స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నాను.

నేను నా దేశానికి వెళ్లినా కూడా ఇది మారదు. పాక్ ఆర్మీ అధికారులు నన్ను బాగా చూసుకున్నారు. నన్ను స్థానిక మూకల నుంచి పాక్ కెప్టెన్ ఒకరు రక్షించారు.

పాక్ ఆర్మీని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను.

పాక్ అధికారి: అయితే నువ్వు వింగ్ కమాండర్ వా? ఇండియాలో ఎక్కడి వాడివి? అభినందన్: క్షమించండి… నేను చెప్పలేను… దక్షిణ భారతావనికి చెందినవాడిని.

పాక్ అధికారి: నువ్వు దక్షిణ భారతానికి చెందిన వ్యక్తివా? సరే… నీకు పెళ్లయిందా?
అభినందన్: అవును అయింది.

పాక్ అధికారి: నీకు మేమిచ్చిన టీ నచ్చినట్లుంది.
అభినందన్: టీ చాలా బాగుంది… కృతజ్ఞతలు.

పాక్ అధికారి: నువ్వు ఏ విమానాలు నడపగలవు?
అభినందన్: క్షమించండి… ఈ విషయాన్ని నేను చెప్పలేను.

పాక్ అధికారి: నీ మిషన్ ఏంటి?
అభినందన్: నేను చెప్పలేను.
పాక్ అధికారి: ఓకే థ్యాంక్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *