పలువురి ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా…ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది

రాజ్యసభ ఎన్నికల్లో ఆనూహ్య పరిణామాలు..

ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురి ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంది.. ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీకి దిగడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను 170 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార వైసీపీకి ఓటేసినట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి జగన్ సర్కార్‌కు ఎమ్మెల్యే రాపాక అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీలో తొలి ఓటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వినియోగించుకోగా, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీలో తొలి ఓటేశారు.

వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ‘రాంకీ’ అయోధ్యరామిరెడ్డి, రిలయర్స్‌ గ్రూపునకు చెందిన పరిమళ్‌ నత్వానీ పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ఓటును వినియోగించుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

మరో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఓటు వేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు.

అయితే వీరంతా విప్‌ను ధిక్కరించి వైసీపీకి ఓటేశారా.. లేక సొంత పార్టీకి ఓటేశారా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

అలాగే అరెస్ట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఓటేయలేకపోయారు.

మరో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

దీంతో ప్రతిపక్ష చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి తనకున్న 23 మంది సభ్యుల ఓట్లు కూడా పడే అవకాశాలు లేవు.

మరోవైపు అధికార వైసీపీకి మాత్రం తమకున్న 151 ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలయ్యే చాన్స్ కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *