పౌరసత్వ సవరణ చట్టంపై మైనార్టీల్లో ఆందోళన…దీనిపై స్పందించారు దక్షిణాది సూపర్‌స్టార్…

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు ఆందోళల నేపథ్యంలో తమిళ తలైవా తొలిసారి దీనిపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రజినీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై మైనార్టీల్లో ఆందోళనలు నెలకున్న వేళ.. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ దీనికి తన మద్దతు ప్రకటించారు.

సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని తలైవా హామీ ఇచ్చారు.

చెన్నైలోని పోయెస్ గార్డెన్ వెలుపల బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు.

ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే వారి వెనుక నిలబడి పోరాడే మొదటి వ్యక్తిని నేనవుతాను.

దేశ విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ఎలా అనుకుంటున్నారు?

సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజనీ వ్యాఖ్యానించారు.

అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు ఆ అవకాశం ఇవ్వరాదని రజినీ సూచించారు.

ఈ సందర్భంగా..ఎన్ఆర్సీపై స్పందించిన రజినీ… బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఇది చాలా ముఖ్యమైనదని అన్నారు.

ఎన్నార్సీ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, దీనిని అమలు చేస్తున్నట్టు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. కేవలం చర్చ దశలోనే ఉందని ప్రభుత్వం కూడా స్పష్టం చేసిన విషయాన్ని రజినీ గుర్తుచేశారు.

అంతేకాదు, 2011లో నాటి యూపీయే హయాంలోనే ప్రతిపాదనలు చేసి, 2015లో అమలకు చర్యలు తీసుకున్నారన్నారు.

శ్రీలంక కాందశీకులకు రెండు పౌరసత్వాలు లభిస్తాయన్నారు. శ్రీలంక నుంచి వచ్చినవారందరూ తమిళనాడులో ఉంటే వారికి ద్వంద్వ పౌరసత్వం కల్పించనున్నారని రజినీకాంత్ పేర్కొన్నారు.

అంతేకాదు, తాను నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆదాయపు పన్ను విషయంలో జరుగుతున్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి.

గత డిసెంబరులో సీఏఏపై పరోక్షంగా స్పందించిన రజనీ.. దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనలపై విచారం వ్యక్తం చేశారు. ‘ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనేందుకు హింస, అల్లర్లు మార్గం కాకూడదు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలి.. దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని రజనీ ఆ మధ్య ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *