రాహుల్ గాంధీకి సీఎం జగన్ కౌంటర్.. ప్రధాని మోదీకి మద్దతుగా..

ఢిల్లీ రాజకీయాలపై ఆచితూచి మాట్లాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కొందరు కావాలనే వివాదాన్ని రాజేయాలని చూస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనమంతా ఐకమత్యంతో ఒక్కటేనని చాటిచెప్పాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు.

అంతేగాని తప్పులు వెతికిపట్టుకుని ఒకరిపై వేలు చూపటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు చాలా ఆమోదయోగ్యమైన వివరణలు ఇచ్చారని సీఎం జగన్ వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా నిలబడాల్సి ఉందన్నారు. ఐకమత్యం మన బలాన్ని చాటుతుందని, విభజన మన బలహీతను బయటపెడుతుందని హితవుపలికారు.

కాగా, దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని, ఎలాంటి చొరబాటూ జరగలేదని ప్రధాని మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మన పోస్టుల్లో ఏదీ ఇంకొకరి కబ్జాలో లేదన్నారు. దేశ రక్షణ పట్ల ఎవరికీ వీసమెత్తు అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు.

అయితే భారత భూభాగంలోకి చైనా ప్రవేశించని పక్షంలో మన సైనికులు ఎందుకు మరణించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

అలాగే మన భూభాగంలో ఉన్న గల్వాన్‌ లోయ తమదేనని చైనా ప్రకటించడంపై ప్రధాని తక్షణమే వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది.

దేశ రక్షణలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేయడం విచారకరమని అభిప్రాయపడింది.

ఇది వరకే దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.

20 మంది సైనికుల వీర మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చింది.

ఈ తరుణంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *