వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు…రఘురామ కృష్ణంరాజు

రాజు గారి రాజకీయం: వైసీపీ టు వైసీపీ.. వయా బీజేపీ, టీడీపీ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజు సడన్‌గా పార్టీ మారడం వెనుక చాలా తతంగమే నడిచిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కనుమూరి రఘు రామ కృష్ణంరాజు మరోసారి పార్టీ చేరారు.ఆదివారం ఆయన వైఎస్ జగన్‌ను కలిసిన ఆయన వైసీసీ కండువా కప్పుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రయాణం సాఫీగా జరగడం లేదు.

ఐదేళ్ల కాలంలో ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలను ఆయన కవర్ చేసేశారు.

జగన్ వైఖరితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరారు. వీలు చిక్కినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడేవారు.

ఆ తర్వాత బీజేపీలో పొసగక సైకిలెక్కారు. అక్కడా సంవత్సరం కూడా ఉండలేక తిరిగి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజు సడన్‌గా పార్టీని వీడటం వెనుక చాలా తతంగమే నడిచిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నరసాపురం టిక్కెట్‌పై టీడీపీ అధిష్ఠానం ఎటూ తేల్చకపోవంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.

పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో ఉన్నానని, అలాంటి తనకు టిక్కెట్ కేటాయించడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులను దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది.

దీంతో ఆయన పార్టీ మారనున్నారన్న ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. వారం రోజుల క్రితం ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను టీడీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

అయితే రెండ్రోజులుగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. శుక్రవారం హైదరాబాద్‌లో తన సన్నిహితులతో సమావేశమైన రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే టీడీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి వైసీపీలోనే చేరితే మంచిదని సన్నిహితులు అభిప్రాయపడటంతో ఆయన అంగీకరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.

అయితే నరసాపురం టిక్కెట్‌పై జగన్ హామీ ఇచ్చారో లేదో తెలియరాలేదు. గతంలో వైసీపీని వీడిన సమయంలో వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు మళ్లీ తిరిగి ఆయన చెంతకే చేరారు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *