ఆ కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి.. జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ డిమాండ్

కరోనా వైరస్‌కు బారినపడి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి సోకి మరణించిన ఉద్యోగస్తుల కుటుంబాలకు కోటి రూపాయిలు నష్ట పరిహారంగా ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు.

ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న

ప్రతి ఒక్కరి సేవలు విస్మరించలేనివని పవన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 200 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, 600 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని తెలుస్తోందన్నారు.

అలాగే పోలీస్ శాఖలో ఇప్పటి వరకు 10 మంది వరకు కరోనా బారిన పడి మరణించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాల సిబ్బంది త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

కరోనాపై పోరులో ఆ వైరస్‌కి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించకూడదని పవన్ పేర్కొన్నారు.

పరిహారంగా రూ. కోటి ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పలువురు విధులకు హాజరవుతున్నారని.. ఆ సమయంలో వారు కరోనా బారినపడుతున్నారని పేర్కొన్నారు.

వైద్యానికీ, తదనంతరం తీసుకోవాల్సిన విశ్రాంతికీ నాలుగు వారాల సమయం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ కాలానికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారికీ ఈ తరహా సెలవులు అవసరమని అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు సంస్థల నిర్వాహకులు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని కోరారు.

యాజమాన్యాలకు ఇబ్బందులు ఉన్నా కూడా సంస్థ కోసం పని చేసినవారు అనుకోకుండా కరోనా బారినపడ్డందున సెలవుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

దీని వల్ల వేతనం కోల్పోతామనే ఆందోళన లేకుండా వారు మానసిక ప్రశాంతతతో త్వరగా కోలుకొంటారని పవన్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *