పూంచ్ సెక్టార్‌లో మరోసారి బరితెగించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. దాయాదుల మధ్య మరో సమరం తప్పదనే పరిస్థితి.

జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంతో ఆందోళన. మరోసారి పూంచ్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడిన పాకిస్థాన్. పాక్ దుశ్చర్యలను సమర్ధంగా తిప్పికొట్టిన భారత్.

పుల్వామా ఆత్మాహుతి దాడితో భారత్, పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులతో మరింత తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతోంది.

ఆయుధగారాలు, ఆర్మీ బ్రిగేడ్ కేంద్ర కార్యాలయాలే లక్ష్యంగా బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత్‌లోకి చొరబడ్డాయి.

వీటిని అడ్డుకునే ప్రయత్నంలో ఓ వింగ్ కమాండర్ పాకిస్థాన్‌కు చిక్కారు. మరోవైపు, పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తోంది.

జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్‌లో పాక్‌ రేంజర్లు గురువారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు.

పాక్‌ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారీగా కాల్పులు, మోర్టార్ల దాడులు జరగడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు. కొందరు ఇళ్లను విడిచి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సైతం సెలవు ప్రకటించారు.

ఈ ప్రాంతాల్లోని పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంబడి ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ బలగాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.

దేశంలోని వివిధ విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో భద్రత పరిస్థితులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతస్థాయిలో సమీక్షించారు.

భారత్‌-బంగ్లా సరిహద్దుల్లోనూ బీఎస్‌ఎఫ్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు. అమృతసర్‌, జమ్మూ, శ్రీనగర్‌, లేహ్‌ తదితర విమానాశ్రయాలతో పాటు వివిధ వైమానిక స్థావరాలు, ఓడరేవుల వద్ద కూడా భద్రతను పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *