“పోలవరం” పేరుతో స్పెషల్ ఎక్కౌంట్ ఓపెన్ చేయండి జనం మీకు సహకరించటానికి సిద్ధంగా ఉన్నారు బాబు గారు!

ఏపీకి సహాయ నిరాకరణ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ వాసి. మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి. మహాత్ముడు బ్రిటీష్‌ వాళ్లకు సహాయ నిరాకరణ చేస్తే మోడీ గారు ఏపీకి సహాయ నిరాకరణ చేస్తున్నారు. అందుకు బదులుగా మనం ఆ మహాత్ముడు చూపించిన అహింసా మార్గంలో పోరాడదాం. మహాత్ముడిలాగే అహింసతోనే జయిద్దాం. అది ఎలాగ అంటే. బాబు గారు.. మీరు పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేక అక్కౌంట్‌ ఓపెన్ చేయండి.

ప్రజలు అందరం తలో చేయి వేయటానికి సిద్ధంగా ఉన్నాం.పట్టిసీమతో పంటలు పండించిన రైతులు విరాళంగా ధాన్యం ఇస్తారు. ఆంధ్రరాష్ట్ర భాగ్యరేఖ కోసం ఆంధ్రుల జీవనాడి నిర్మాణం ద్వారా ముందు తరాలు సుఖసంతోషాలతో వర్థిల్లటం కోసం మీరు ముందడుగు వేయండి. చేయాల్సిన వాడు చేయకపోతే అందుకు వాడు అనుభవించాల్సింది అనుభవిస్తాడు. ముందు మీరు ముందడుగు వేయండి. మీరు చెప్పండి శ్రమదానం కోసం వేలమందిమి లారీలు, ట్రాక్టర్లు కట్టుకుని వచ్చి శ్రమదానం చేస్తాం. ఏపీలోని ప్రతి నియోజకవర్గం నుంచి రాష్ట్రం కోసం తరలిరావటానికి జనం సిద్ధంగా ఉన్నారు. చరిత్రను సృష్టిద్దాం. చరిత్రను తిరగ రాద్దాము. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎంతో ధన్యులు.

వారు చరితార్థులు.మేం కూడా చరిత్రలో నిలిచిపోయే భాగ్యం కలిపించండి. అశోకుడు చెట్లు నాటించెను అని చరిత్ర చదువుకుంటున్నాము ఇప్పటికీ. చంద్రబాబు పోలవరం నిర్మించెను అని ముందు ముందు చరిత్ర పాఠాల్లో రాసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం జోలెపట్టి సేకరిద్దాం. ప్రతి బడి పిల్లోడు నుంచి తలో రూపాయి అయినా తీసుకుందాం. మన రాజధానిలో ప్రతి ఊరు మట్టి, ప్రతి చెరువు నీరు ఉన్నట్టే మన రాష్ట్ర సౌభాగ్యాన్ని నిర్ణయించే పోలవరం నిర్మాణంలోనూ ప్రజలు అందరికీ భాగస్వామ్యం ఇవ్వండి. సినిమా వాళ్లు సహా అందరూ సిగ్గుపడి మరీ ముందుకు వస్తారు ఇస్తారు. అలాగే ప్రవాసాంధ్ర మిత్రులారా మీకు కూడా విజ్ఞప్తి ఏమిటంటే…….”ఎంత దూరంలో వుంటే అంత అభిమానం పెరుగుతుంది. అది ప్రాంతం అయినా, భాష అయినా. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూసే వారిలో మీరే అగ్ర స్థానం లో వుంటారు, ఇది నిజం.

వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో, మీ మీ వృత్తి రీత్యా వుంటూ, ఎప్పటికైనా ఇక్కడ వచ్చి స్థిరపడాలి అనే ఆశతో, నిత్యం మన ప్రాంతం గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి ఆసక్తితో గమనిస్తూ వుంటారు. దయచేసి, రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలలో పాలుపంచుకోండి. మీడియాలో మితిమీరిన మిడి మిడి జ్ఞాన విచ్చిన్నకర దోరణులు చూసి బాధ పడుతూ, విరక్తి తో దయ చేసి మానసికంగా రాష్ట్రానికి దూరం కాకండి. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఓ అదృష్టం. రాష్ట్రం అభివృద్ధి చెందడం మన ఆశయం. పోలవరం వంటి మహా ప్రాజెక్టు నిర్మాణానికి మీరు అందరూ కూడా తలో చేయి వేసి సాయం చేయండి. ముందు జనంతో మమేకం అవుదాం. జనంలోకివెళదాం బాబుగారు. మీరు ముందడుగు వేయండి. మీతో మేము నడుస్తాం. సిగ్గుపడి కేంద్ర పాలకులు పరుగులు పెట్టుకుని రావాలి ఈ దెబ్బకి.ఊరూరా గడపగడపా పోలవరం కోసం జోలె పట్టి నిధులు తీసుకుందాం. పేటీఎం వాళ్లు మన తెలుగువారే. వారికి విజ్ఞప్తి చేసి అందులో పోలవరంకి కూడా చెల్లింపు చేసేలా చేద్దాం. అలాగే ఎయిర్‌టెల్‌ మనీ సహా అన్ని సెల్‌ఫోన్ల నుంచి కూడా మనీ పంపవచ్చు. ఆ మార్గాల్లో కూడా సేకరిద్దాం.

పోలవరం నిర్మాణంలో ఆరుకోట్లమందీ పాల్గొనాల్సిందే. ప్రతిపక్షాన్ని కూడా విరాళం అడుగుదాం. గాంధీ చూపిన అహింస యుద్ధంకి మేం సిద్ధం. కేంద్రం అమలు చేస్తామని చెప్పి కూడా అమలు చేయని, పార్లమెంటు చట్టం చేసినా దానిని పాటించని వాళ్లకి ఈ పోరాటం గుణపాఠం కావాలి. ఆంధ్రరాష్ట్రం దేశంలోనే సంచలనం సృష్టించాలి. జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌లో ఉండే వార్త ఇది అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *