ఏపీలో మాట్లాడే హక్కులేదా.. ఆ యువకుల అరెస్టు దారుణం.. చంద్రబాబు ఫైర్

ఏపీలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, పరిరక్షణ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు.

చట్టవిరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించేస్తోంది.

సోషల్‌ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

రూ. 5.20 కోట్ల నగదు అక్రమ రవాణా కేసులో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తమిళనాడు అంతటా మీడియాలో ప్రసారమయ్యాయని, ఏపీలో మాత్రం నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి సందీప్‌, చంద్రశేఖర్‌ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

జిల్లాలోని టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన తొట్టెంపూడి చంద్రశేఖర్‌, సందీప్‌ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తమిళనాడు ఎల్లావూరు చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ నగదు విషయంలో మంత్రి బాలినేనికి సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సదరు యువకులు షేర్ చేశారు. దీంతో పోలీసులు వారిపై యాక్షన్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *