అడ్డదారిలో సీఎం కావాలని.. సమాచారం దొంగిలించే యత్నం: నారా లోకేశ్

వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని ఉద్దేశించి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు. అడ్డదారిలో జగన్‌ను సీఎం చేయాలని కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు.

1.అడ్డదారిలో జగన్‌ను సీఎం చేయాలని కుట్రలు..
2.టీడీపీ ఓటర్ల గల్లంతు, పార్టీకి ఐటీ సేవలందించే సంస్థలపై తెలంగాణ పోలీసులతో దాడులు.
3.చంద్రబాబును ఎదుర్కోలేక ముగ్గురు మోదీల కుతంత్రాలు..
మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు.

ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక‌ ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు.

ముగ్గురు మోదీలు ఒక్కటై టీడీపీకి ఐటీ సేవ‌లు అందించే కంపెనీల‌పై దాడుల‌కు దిగారని ఆరోపించారు.

కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక, కుయుక్తుల‌తో అమ‌రావ‌తి నిర్మాణాన్ని ఆప‌లేకే ఇలాంటి కుయుక్తులకు తెరతీశారన్నారు.

టీడీపీ ఓట్ల తొలగింపు అంశంపై ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

‘క్యాడర్ లెస్ జగన్‌ను అడ్డదారిలో ముఖ్యమంత్రిని చెయ్యాలని ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు.

నియంత మోదీ డైరెక్షన్‌లో, ఫ్యాక్షనిస్ట్ జ‌గ‌న్ యాక్షన్, దొర కేసీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతోంది. ఆంధ్రా ప్రజలే దీనికి రియాక్షన్ ఇస్తారు’ అని లోక్‌శ్ ట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ స‌భ్యత్వాలు, సేవామిత్రల స‌మాచారం దొంగిలించే ప్రయత్నం చేశారని లోకేశ్ మండిపడ్డారు.

టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు.

‘ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోదీ సమేత కలువ కుంట జగన్‌కు సిగ్గుగా అనిపించడం లేదా?’ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజాక్షేత్రంలో టీడీపీని ఎదుర్కోలేకే దొంగబ్బాయి చీప్‌ పాలిట్రిక్స్‌ మొదలు పెట్టారని నారా లోకేశ్‌ విమర్శించారు.

వైసీపీ దిగజారుడు పనులు చేస్తోందన్నారు. ఓట్ల కుట్ర చేస్తున్న వైసీపీని ఏపీ ఓటర్లు ఇంటికి పంపడం ఖాయమన్నారు.

గుంటూరులోని కారంపూడి మండలంలో టీడీపీకి పార్టీకి చెందిన 1200 మంది ఓట్లను తొలగించేందుకు వైపీపీ నాయకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారని టీడీపీ నాయకులు ఓ వైపు..

ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైసీపీ నాయకులు మరోవైపు శుక్రవారం (మార్చి 1) రాత్రి కారంపూడి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

10 రోజులుగా ఓటర్ల జాబితాల్లో చేర్పులు, తొలగింపుల ప్రక్రియను ఎన్నికల సంఘం బీఎల్వోలు, ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టింది.

ఇదే అదనుగా కారంపూడి మండలంలోని టీడీపీ అనుకూలంగా ఉండే 1200 మంది ఓట్లు తొలగించడానికి వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఆన్‌లైన్‌ ద్వారా వివరాలను అందిస్తూ 1200 మంది ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

వైపీపీకి చెందిన 6 మంది ఆన్‌లైన్‌లో ఆ దరఖాస్తులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *