రాజకీయ రణరంగంలో లగడపాటి గగ్గోలు..

రాజకీయాల్లో కనిపించనంటూ ఒట్టేసుకుని మరీ కనిపించకుండా పోయిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండలేకపోతున్నారు. గడచిన ఎన్నికల్లో తాను ప్రకటించిన మేరకు పోటీ కి దూరంగా ఉండిపోయిన లగడపాటి కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగానే ఉన్నారు.

ఈ ఐదేళ్లలో పెద్దగా బయట కనిపించకున్నా… ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏడాది కాలంగా లగడపాటి తనదైన శైలిలో ఎంట్రీలు ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పలుమార్లు లో భేటీ అయిన లగడపాటి… 2019 ఎన్నికల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేన్న ఫీలర్లను వదిలారు. అయితే ఎప్పటికప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతూనే ఉన్న రాజగోపాల్… ఎన్నికల హీట్ ఎక్కడ ఉంటే… అక్కడ ప్రత్యక్షమైపోతూ తనదైన శైలి కొత్త రాజకీయాలకు తెర తీశారు.

తెర వెనుకే ఉన్నా… తెర ముందున్న నేతల జయాపజయాలను నిర్దేశించే రీతిలో చక్రం తిప్పుతున్నారు లగడపాటి… మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఓ తప్పుడు సర్వేను ఇచ్చి… ఆంధ్రా ఆక్టోపస్ అంటూ తనకు దక్కిన సార్ధకతను చేజేతులారా నాశనం చేసుకున్నారు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో తనదైన శైలి మంత్రాంగం నెరిపేందుకు రంగంలోకి దిగిపోయారు.ఇక్కడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను రానంటూనే తనదైన మార్కు రాజకీయాలు చేస్తున్నారన్న వాదన లేకపోలేదు.

టీడీపీ సీనియర్ నేత – ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రహస్య మంతనాలు

నిన్న గుంటూరులో ప్రత్యక్షమైన లగడపాటి… టీడీపీ సీనియర్ నేత – ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో రహస్య సమావేశాన్ని నిర్వహించారు. నేరుగా కోడెల ఇంటికే వెళ్లి మంతనాలు సాగించే అవకాశాలున్నా… నగరంలోని ఓ వ్యాపార సముదాయంలో కోడెలను కలిసి లగడపాటి కొత్త చర్చకు తెర తీశారు.

ఎంత రహస్యంగా జరిగినా… భేటీ ముగిసిన కాసేపటికే ఈ విషయం మీడియాకు లీకైపోయింది. దీంతో అసలు ఈ భేటీ ఉద్దేశం ఏమిటన్న విషయంపై చర్చ జరుగుతుండగానే… తిరిగి విజయవాడ వచ్చిన లగడపాటి… ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా అలా ఉండిపోయిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతోనూ భేటీ అయ్యారు.

ఈ వరుస భేటీలతో అసలు రాజగోపాల్ వ్యూహం ఏమిటన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగిన తర్వాత తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడని లగడపాటి… అధికార పార్టీ టీడీపీ తరఫున చక్రం తిప్పేందుకే ఆసక్తి చూపుతున్నారన్న మాట వినిపిస్తోంది.

వంగవీటిని టీడీపీలోకి లాగేందుకే లగడపాటి హల్ చల్

నిన్నటి రెండు భేటీలను పరిశీలిస్తే… వంగవీటిని టీడీపీలోకి లాగేందుకే లగడపాటి హల్ చల్ చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కేవలం డైరెక్ట్ ఫైట్ కే సిద్ధపడ్డ వంగవీటి… తాను ఆశించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వలేమనగానే వైసీపీకి రాజీనామా చేశారు.

అంతుకుముందు టీడీపీతో చర్చలు జరిపిన తర్వాతే వైసీపీకి రాజీనామా చేశారన్న వాదన వినిపించినా… విజయవాడ సెంట్రల్ సీటును టీడీపీ కూడా వంగవీటికి ఇచ్చేది లేదని తేల్చేసిందట. పార్టీలో చేరితే ఏదో ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని కబురు పెట్టిందట. దీంతో షాక్ తిన్న వంగవీటి టీడీపీలో చేరకుండా… అటు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వలేక నానా యాతన పడుతున్నట్లుగా తెలుస్తోంది.

తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ఉన్నా.. ఏమాత్రం ప్రభావం చూపని ఆ పార్టీలో చేరేందుకు కూడా వంగవీటి ససేమిరా అంటున్నారట. ఇదే క్రమంలో ఇటీవల పలువురు కీలక నేతలు టీడీపీకి రాజీనామాలు చేసి వైసీపీలో చేరిపోవడంతో కొన్ని కీలక స్థానాలకు టీడీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఈ క్రమంలో వంగవీటి ఒప్పుకుంటే… కృష్ణా జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో కీలక స్థానాలను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసిందట.

ప్రతిపాదనకు వంగవీటి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు లగడపాటి చేస్తున్న పని వంగవీటిని ఒప్పించేందుకేనట. పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణంరాజు టీడీపీకి హ్యాండివ్వడంతో అక్కడ బలమైన నేత కాపు నేత అయితే బాగుంటుందనేది టీడీపీ భావన. పొరుగు జిల్లా – కాపు బ్రాండ్ నేతగా వంగవీటి అక్కడ పోటీకి సరేనంటే… టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగానే ఉందట.

లగడపాటి…. వంగవీటితో భేటీ

ఇక కోడెల శివప్రసాద్… ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ దఫా తన సొంత నియోజకవర్గం నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారట. అయితే సత్తెనపల్లికి అభ్యర్థిని వెతికిపెట్టి… నరసరావుపేటకు వెళ్లాలని చంద్రబాబు తేల్చిచెప్పారట.

సత్తెనపల్లిలోనూ కాపు ఓట్లు బాగానే ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి వంగవీటి పోటీ చేస్తే… కాపు ఓట్లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరిన్ని ఓట్లు వచ్చేలా చేస్తానని కోడెల భావిస్తున్నారట. ఈ విషయంపై చర్చించేందుకే కోడల పిలుపు మేరకే నిన్న లగడపాటి గుంటూరు వెళ్లారట.

ఆ చర్చలు ముగిసిన తర్వాత ఇటు నరసాపురం అటు సత్తెనపల్లి ఏది కావాలో చెప్పాలంటూ అడిగేందుకు లగడపాటి…. వంగవీటితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రత్యక్ష బరికి సిద్ధంగా లేకపోయినా… తనదైన శైలి మంత్రాంగంతో లగడపాటి టీడీపీ వ్యవహారాలన్ని చెక్క పెడుతున్నట్లు సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *