జగన్‌ను ఓ రేంజ్‌లో విమర్శించిన జూపూడిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పార్టీ లిడర్ అసంతృప్తితో…జూపూడిని పార్టీలో చేర్చుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయట…

YSRCPలోకి జూపూడి.. పార్టీ శ్రేణుల షాక్, జగన్ ఓకే చెప్పడానికి కారణాలివేనట..

YS Jagan సమక్షంలో జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్సీపీలో చేరారు. గతంలో జగన్‌ను ఓ రేంజ్‌లో విమర్శించిన జూపూడిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పార్టీ కేడర్ అసంతృప్తితో ఉంది. కానీ ఆయన్న పార్టీలో చేర్చుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయట.

దసరా పర్వదినాన వివిధ పార్టీలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు.

జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. మిగతా నేతల సంగతి పక్కన బెడితే.. జూపూడిని పార్టీలో చేర్చుకోవడాన్ని అధికార పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

వాస్తవానికి జూపూడి వైఎస్ కారణంగానే ఈ స్థాయికి ఎదిగారు. రాజశేఖర రెడ్డి ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ మరణం తర్వాత జూపూడి జగన్‌తో కలిసి నడిచారు. వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు.

కానీ 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయన్ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు.

అప్పటి వరకూ వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న జూపూడి టీడీపీలో చేరిన తర్వాత జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

జగన్‌‌ను సైకో, కాలకేయుడు, విషం అంటూ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు.

టీవీ చర్చా కార్యక్రమాల్లో టీడీపీ తరఫున మాట్లాడిన జూపూడి.. పాదయాత్రలతో సీఎంలు కాలేరంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఛాన్స్ దొరికితే చాలు వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో.. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు.

జగన్ పాలనను ఫిడెల్ క్యాస్ట్రో పాలనతో పోలుస్తున్నారు.

గతంలో ఓ రేంజ్‌లో తనపై విషం చిమ్మిన నేతను జగన్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏంటనేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రశ్న.

గతంలో తాము ఢీకొట్టిన వ్యక్తితో ఇప్పుడు కలిసి పనిచేయాలా? అని ప్రశ్నిస్తున్నారు.

కానీ జగన్ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు, సామాజిక సమీకరణలు చాలా ఉన్నాయి.

జూపూడి మాల సామాజికవర్గానికి చెందిన నేత. ఆ సామాజిక వర్గంతో నిత్యం టచ్‌లో ఉండే కొద్ది మంది నేతల్లో ఆయనొకరు.

ఏపీలో ఎస్సీ జనాభా ఎక్కువనే సంగతి తెలిసిందే.

ఎస్సీల్లో రకరకాల వర్గాలు ఉన్నప్పటికీ.. మాల, మాదిగ జనాభా ఎక్కువ. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మీద కోపంతో ఎస్సీలంతా జగన్ వైపు మొగ్గు చూపారు.

మాల సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకోవడంతోపాటు చంద్రబాబును దెబ్బకొట్టడానికి జగన్ నిర్ణయం ఉపకరిస్తుంది.

జూపూడి చేరిక తమకు ఎంత ప్లస్ అవుతుందో.. టీడీపీకి అంత నష్టం చేకూరుస్తుందనేది వైఎస్ఆర్సీపీ పెద్దల అంచనా.

కాబట్టి జగన్‌ను తిడితే తిట్టాడు.. మనకు కావాల్సింది టీడీపీని దెబ్బకొట్టడం అంటున్నారు.

మరీ బాధపడొద్దని.. గతంలో బొత్స, ఆమంచి లాంటి నేతలు జగన్‌ను తిట్టలేదా..? ఇప్పుడు వారు పార్టీలో కొనసాగడం లేదా?

అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయం అంటే అంతే కదా మరి.. మనకు నచ్చడం నచ్చకపోవడం కాదు. పార్టీకి హెల్ప్ అయితే చాలు.. అర్థం చేసుకోండని హితబోధ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *