జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి

మానవులుజన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు.

సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా మరంగా ఉంటాయి.

మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే.

కత్తులు, కఠారులు,బాంబులు, తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళలో పోసిన త్యాగశీలి, అమరవీరులు మన బాపూజీ.


ఆయన జగతిలో అందరికీ ఆదర్శప్రాయులు.
అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తి అయినా తలవంచక తప్పదు. హింసకు సరైన సమాధానం అహింస మాత్రమే అని గాంధీజీ నొక్కి వక్కాణించేవారు.

1948 జనవరి 30 భారత జాతికే దుర్దినం.ఆరోజు సాయంకాలం 4 గంటలకు అహింసా సిద్ధాంత ప్రవక్త , మన జాతిపిత, పూజ్య బాపూజీ నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవియై నేలకొరిగారు. స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము.

దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి పగలనక ,రాత్రనక అహోరాత్రులు కాపలా కాసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయని అమరవీరులు ఎందరో ఉన్నారు.

వారందరినీ ఈరోజు స్మరించుకొని నివాళులర్పిస్తాం.
ప్రధమ స్వాతంత్ర సంగ్రామ నేతలైన
ఝాన్సీ లక్ష్మీ బాయ్,
రాణీ అబ్బక్కాదేవి,
తాంతియా తోపే ,
కిట్టూర్ రాణి చిన్నమ్మ,
బేగమ్ హజరత్ మహల్,
బహదూర్ షా జాఫర్,
మర్రా పాండియార్,
చిదంబరం పిళ్లై ,
సుబ్రహ్మణ్యభారతి,
అసఫ్ జుల్లాఖాన్,
వాసుదేవ బలవంత పాండే,
నానాసాహేబ్,
మంగళ పాండే.

ఇంకా మరుగున పడిన మనకు తెలియని ఎందరో ఉన్నారు వారందరినీ ప్రప్రథమంగా గుర్తు చేసుకోవాలి.

విప్లవ కారులుగా స్వాతంత్రం కోసం ప్రాణాలనర్పించిన
చంద్రశేఖర్ ఆజాద్,
సర్థార్ భగత్ సింగ్,
అల్లూరి సీతారామరాజు,
మొదలగు విప్లవ సింహాలను,
బాలగంగాధర తిలక్,
లాలాలజపతిరాయ్,
బిపిన్ చంద్ర పాల్,
సుభాశ్ చంద్ర బోస్,
వంటివారి ముందు మోకరిల్లాలి.

విజయలక్ష్మీపండిట్,
సరోజినిదేవి,
దుర్గాబాయ్ దేశ్ ముఖ్,
కమలా నెహ్రూ.

వంటి ఎందరో మహిళలు…

సర్దార్ వల్ల భాయ్ పటేల్,
జవహర్లాల్ నెహ్రూ,
లాల్ బహదూర్ శాస్త్రి,
పోట్టి శ్రీరాములు,
బసవరాజు అప్పారావు
ఇంకా ఎందరో ఎందరో గొప్ప వారు, వారందరినీ స్మరించుకోవాలి.

స్వాతంత్రం వచ్చిన తరువాత భారత దేశాన్ని రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో సైనికులు నమస్కరించదగిన వారు.

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలనర్పించిన
పద్మ ఫణి ఆచార్య విక్రమ్,
మనోజ్,సంజయ్
వంటి అమరవీరులు సదా చిరస్మరణీయులు.

అమరవీరుల జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ పేరుతో ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం

అమరవీరుల కోసం 30న అంతా మౌనం

ఉదయం 10.58 నుంచి 11 గంటల దాకా రాకపోకలకు బ్రేక్‌…

నో హారన్‌

ఎక్కడివారక్కడే నిశ్శబ్దం దేశంకోసం మనకోసం…

ప్రాణాలర్పించిన అమరవీరులు వారు. ఆ త్యాగధనులను స్మరించుకునేందుకు ఒక్క రెండు నిమిషాలు నువ్వూ నేను, అందరం మౌనం పాటిద్దాం.. ఆ రెండు నిమిషాలు ఎక్కడివాహనాలు అక్కడే నిలిపేద్దాం.. హారన్లు ఆపేద్దాం.. అని ప్రభుత్వం పిలుపునిచ్చింది.


కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఆ రోజు ఉదయం 10.58 గంటల నుంచి 11 గంటల దాకా.. అంటే 2 నిమిషాలపాటు రాష్ట్రంలోని వాహనాల రాకపోకలన్నీ నిలిపివేస్తారు.


ఆ సమయంలో వాహనాల ఇంజిన్లు ఆపివేయడంతోపాటు హారన్లు కూడా మోగించరు. కార్యాలయాల్లో కార్యకలాపాలు ఆగిపోతాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు ప్రజలంతా ఆ 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం కోరింది.

ఈ సమయాన   ఆయన గూర్చి ఎంత తలచుకున్నా సరిపోని బాపూజీ గూర్చి మనం కొంత మననం చేసుకుందాం

1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోర్బందర్ లో కరంచంద్ పత్లీబాయ్ లకు బాపు జన్మించారు.

ఆయన పన్నెండవ యేట కస్తూరిబా తో వివాహమైనది.

ఇంట్లో ఎంత క్రమ శిక్షణతో పెరిగినప్పటికీ,పాఠశాలలో కొందరు చెడు స్నేహితుల దురలవాట్లు అబ్బాయి. ముఖ్యంగా నిషిద్ధమైన ‘మాంసభక్షణ’ చేసేవారు.

జీవహింస చేయకూడదని తెలుసుకున్న గాంధీ సాత్విక ఆహారానికి మారిపోయారు.

ఆయన కుటుంబం లో ఏలోటూ లేకపోయినా భారతీయులందరూ హాయిగా జీవించలేకపోతున్నారనే వ్యధ ఎక్కువగా ఉండేది.

పైగా తన దేశం పాశ్చాత్యుల చేతుల్లో ఇబ్బందుల పాలవుతున్నారని వాపోయేవారు.

భారతీయులను పాశ్చాత్యులు కొల్లగొడుతున్నారని, వారిని వెళ్లొగొడితే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని స్నేహితులతో అనేవారు.

తను ఏంసాధించాలన్నా చదువు అవసరం అని గ్రహించి బారిష్టరు చదువుకు విదేశాలకు వెళ్లారు.

అక్కడ ఎటువంటి దురలవాట్లకు బానిస కాకుండా అన్ని పరీక్షలలోను
ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతూ ఉత్తమ విద్యార్థిగా పేరు పొందారు.

చదువు అనంతరం భారత దేశానికి తిరిగి వచ్చి ముంబై హైకోర్టులో కొంతకాలం న్యాయవాది గా పనిచేసి ధనవంతుల వద్ద తీసుకున్న ఫీజుతో పేదలకు సహాయం చేసి వారి కేసులను ఉచితంగా వాదించేవారు.

ఒకసారి ఒక సంస్థ తరపున న్యాయ వాదిగా దక్షిణాఫ్రికా లోని ప్రిటోరియాకు వెళ్లారు.

దక్షిణాఫ్రికాలోని భారతీయుల దీనాతిదీన పరిస్థితి ని చూసి గాంధీ గారి హృదయం ద్రవించి పోయింది.


అక్కడ భారతీయులపై అనేక ఆకాంక్షలుండేవి.అక్కడ భారతీయుల చీకటి జీవితంలో వెలుగులా అవతరించారు.


త్యాగం మూర్తీభవించిన భారతీయులు తమ శ్రమనంతా తెల్లదొరలకు ధారపోసి కూడా ఛీత్కారానికి గురవడం ఇక సాగనివ్వకూడదని భారతీయులనందరిని ఒక సంఘంగానీ స్థాపించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి పిటీషన్లు పంపనారంభించారు.

పిటీషన్లు ఇవ్వడానికి కార్యాల యానికి వెళ్లినపుడు వారిని పోలీసులు లాఠీలతో కొట్టేవారు. భారతీయులువారిపై తిరగబడపోతే వద్దు మీరు పొరపాటున కూడా చెయ్యి ఎత్తకండి.

ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి.ఎంత కఠిన హృదయుడనైనా మీ చర్య మార్చ గలదు. అహింసే మన ఆయుధం అని వారికి నూరిపోసేవారుఆ అహింసావాదం ప్రజలందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

భారత దేశ స్వాతంత్ర సమరంలో కూడా బాపూజీ తన అద్భుత అస్త్రం ‘అహింస’ ద్వారానే తెల్లదొరల కఠిన హృదయాలను కరిగింప జేయగలిగారు.

చివరికి ఒకసారి తనమీద హత్యాప్రయత్నం చేయబోయిన వ్యక్తిని పోలోసులు పట్టుకున్నపుడుఅతనికి ఎటువంటి శిక్ష వేయకుండా వదిలిపెట్టివేయమని కోరిన మహానుభావులు.

తను నమ్మిన బాట అయిన అహింస తో ప్రజలను మంత్రముగ్ధులని చేసి మహాత్ముడయ్యారు.

1947 స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం భారత్, పాకిస్తాన్ లుగా ఏర్పడటం ఆయన హృదయాన్ని కలచివేసింది.

దేశవిభజనతో పాటు మత కల్లోలాలు కూడా విజృంభించెను.శాంతినవలంబించి మత సామరస్యము కొరకు పాటుపడమని ప్రజలందరినీ మహాత్మడు హెచ్చరించెను.

సరిగా ఇదే సమయంలో నాథూరామ్ వినాయక్ గాడ్సే అను ఒక యువకుడు 1948 వ సంవత్సరం జనవరి 30 తేదీన ఢిల్లీ లో బిర్లా భవనమున ప్రార్థన కొరకు వెడుతున్న గాంధీజీని తుపాకీ తో కాల్చి చంపెను.

ఈ దుఖవార్త ప్రపంచమునంతను శోక సముద్రములో పడవైచెను.

ఆయన అంత్య క్రియలు పవిత్ర యమునా నదీ తీరాన రాజఘాటు వద్ద జరుపబడెను.అందుచేత అది నేడుయాత్రాస్థలమై నది.

అతడు రాజకీయ వేత్త మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త కూడా, రామ భక్తుడు, దీనజన సంరక్షుడు, హరిజనుల ఉద్దరణ కొరకు , మధ్య పాన నిషేధం కొరకు ఆయన చేసిన సేవ అప్రతిమాన మైనది.

మహాత్ముడు చూపిన బాట మన దేశ రక్షణకు వజ్రమయమైన కోట. మనందరం ఆయన ఆశయాలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి.

ఆయన ఆశయాలు నాడు ,నేడు, ఏనాడు అందరికీ ఆదర్శాలు , ఆచరణీయాలు… అందుకే ఆయన మహాత్ముడై మనందరి మనస్సులలో నిలిచారు….

…అమరవీరులందరికీ జోహార్ జోహార్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *