మళ్ళీ టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్నది…?

ముసుగులో సర్దుబాట్లు!
22 Feb, 2019 03:01 IST

అమరావతి : ఎన్నికల వేడికి ‘పార్టనర్స్‌’ ముసుగు కరిగిపోతోంది! ఇన్నాళ్లూ మభ్యపెట్టేలా తెరపైన విమర్శలు చేసుకుంటూ లోపల చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్న టీడీపీ, జనసేన పార్టీల నిజ స్వరూపాలు బట్టబయలవుతున్నాయి. ఈ రెండు పార్టీలూ సాధారణ ఎన్నికల్లో మరోసారి కలసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులపై ఇప్పటికే ‘ఇద్దరు మిత్రులు’ మధ్య అంతర్గతంగా ప్రాథమిక అవగాహన కుదిరి నట్లు తెలుస్తోంది. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు రహస్యంగా భేటీ అయి ఈ దిశగా ఇప్పటికే చర్చలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల పొత్తులపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే సంఖ్యపై కూడా దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఏయే స్థానాల్లో ఎవరిని పోటీకి నిలపాలన్న అంశాలపై కూడా లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడవచ్చని భావిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ, పొత్తులపై చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఏ ముఖంతో జనం ముందుకు వెళ్లాలి?
వచ్చే ఎన్నికల్లో మరోసారి పొత్తు కుదుర్చుకొని పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయిం చుకున్న టీడీపీ, జనసేన అధిపతులు ప్రజల ముందుకు ఎలా వెళ్లాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌కల్యాణ్‌ నేరుగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు బేషరతుగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కూడా ఇరు పార్టీలు అధినేతలు చెట్టపట్టాలు వేసుకొని ముందుకు కదిలారు. రాజధానిలో బలవంతపు భూసేకరణ, ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలు ఇలా పలు సమస్యలపై వైఎస్సార్‌ సీపీ పోరాటం చేసిన సమయాల్లో టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా రంగంలోకి దిగిన పవన్‌కల్యాణ్‌ వాటిని పక్కదారి పట్టించేలా వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రధాన ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడంతో చంద్రబాబు సూచనల మేరకు పవన్‌కల్యాణ్‌ వ్యూహాత్మకంగా టీడీపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. టీడీపీతో లోపల సంబంధాలు నెరపుతూనే బయటకు మాత్రం ప్రజలను మభ్యపెట్టేలా పలు ప్రకటనలు చేశారు. ఇటీవల చంద్రబాబు – పవన్‌కల్యాణ్‌ ఈ డ్రామాను నడిపించారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో కలసి పోటీ చేసేందుకు వీలుగా సాకులను అన్వేషిస్తున్నారు. ప్రజలకు ఏ కారణం చెప్పి నమ్మించాలనే అంశంపై వీరిద్దరూ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అనే అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది.

కేంద్రం, బీజేపీ, కేసీఆర్‌లను సాకుగా చూపుతూ…
రెండు పార్టీల నేతలు ఇన్నాళ్లూ పరస్పరం చేసుకున్న విమర్శలన్నీ డ్రామా అని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు మళ్లీ పొత్తులతో ముందుకు వస్తే ప్రజలు నిలదీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో మరో కొత్త డ్రామాకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు – పవన్‌కల్యాణ్‌ల భేటీలో ఇందుకు రెండు మూడు రకాల వాదనలను సిద్ధం చేసినట్లు టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. అందులో ఒకటి రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేశాయని చెప్పడం కాగా ఇందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, ఇద్దరి లక్ష్యం ఒకటే కనుక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోటీ చేస్తున్నట్లు నమ్మబలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెరపైకి తేవాలన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకొని పోటీ చేయడం, ప్రజా కూటమి తరఫున చంద్రబాబు ప్రచారం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీన్నే ఇప్పుడు తెరపైకి తెచ్చి ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పనేమిటని, ఆయన పెత్తనం ఇక్కడేమిటని ప్రశ్నిస్తూ ప్రజల వద్దకు వెళ్లాలనే యోచనలో బాబు – పవన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. నాలుగున్నరేళ్లు కేంద్రంలో అధికార భాగస్వామిగా బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో వైఎస్సార్‌సీపీకి సంబంధాలను అంటగట్టి బురద చల్లాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.

3 ఎంపీ సీట్లు.. 25 అసెంబ్లీ
రానున్న ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రాథమికంగా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు 25 స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్లు చెబుతున్నారు. 25 లోక్‌సభ స్థానాల్లో మూడింటిని జనసేనకు ఇచ్చేలా డీల్‌ కుదిరినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్ధుల విషయంలోనూ కొంతవరకు చర్చ జరిగినా మరోసారి భేటీ అయి జాబితాలను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎల్లో మీడియా యూటర్న్‌..
కొన్ని ఎల్లో మీడియా సంస్థలు చంద్రబాబు దేనిపై యూటర్న్‌ తీసుకున్నా అదే బాటలో తాము కూడా యూటర్న్‌ తీసుకుంటున్నాయి. తాజా పరిణామాలే అందుకు తార్కాణంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వంపై ఒక్క వ్యతిరేక వార్తనూ ప్రచురించలేదు. ఆహా ఓహో అంటూ చంద్రబాబుతో పాటు మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తించాయి. రాష్ట్రానికి ఐదేళ్లుగా అన్యాయం జరుగుతున్నా ఏనాడూ ఒక్క ముక్క వార్త రాయని ఈ పత్రికలు తాజాగా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాలంటూ రోజూ మొదటి పేజీలో వార్తలను వండివారుస్తున్నాయి. ఐదేళ్లలో ఏ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు నోరెత్తలేదు. ఏపీకి అన్యాయం జరుగుతోందని, దీనిపై చంద్రబాబు నిలదీయడం లేదని ప్రచురించలేదు. కేంద్రం నుంచి మనమే ఎక్కువ సాధించామని చంద్రబాబు ప్రకటించగానే అదే అంశాన్ని బ్యానర్‌ వార్తగా వెలువరించాయి. ఎన్నికల ముంగిట చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని కేంద్రాన్ని విమర్శించగానే పచ్చ పత్రికలు కూడా అదేబాటలో సాగుతున్నాయి. కేంద్రం చేస్తున్న అన్యాయాలంటూ వరుస కథనాలతో బాబు భక్తిని చాటుకుంటున్నాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌ – చంద్రబాబు భేటీ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సఖ్యతను సమర్థిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలకూ ఎల్లో మీడియా సిద్ధమవుతోందని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

భేటీకి లింగమనేని ఏర్పాట్లు
పవన్‌కల్యాణ్, చంద్రబాబుల భేటీకి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తొలి నుంచి వీరిద్దరికీ లింగమనేని అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా కరకట్టపై అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా లింగమనేని రమేష్‌ నిర్మించిన బంగ్లాను చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. లింగమనేనికి లబ్ధి చేకూరేలా ఏకంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో సైతం చంద్రబాబునాయుడు పలు మార్పులు చేయించారు. రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న లింగమనేని ఎస్టేట్‌ భూములు భూ సేకరణలో పోకుండా సమీపం వరకు వచ్చి ఆగిపోయేలా చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్న లింగమనేని ఇటీవల రా«జధానిలో ఎకరం రూ.4 కోట్ల విలువ చేసే భూమిని రూ.15 లక్షలకే పవన్‌కల్యాణ్‌కు అప్పగించడం తెలిసిందే. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తాజాగా వీరిరువురి మధ్య పొత్తుల భేటీలోనూ లింగమనేని తనవంతు పాత్ర పోషించినట్లు టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *