రాజధాని తరలింపుపై వేగం పెంచిన జగన్ సర్కార్.. సుప్రీం కోర్టుకు లేఖ

ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో దూకుడు పెంచింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు లేఖ రాసింది.
సుప్రీం కోర్టు విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలింపుపై వైసీపీ ప్రభుత్వం వేగం పెంచింది.
సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ సర్కార్.. తాజాగా అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
మూడు రాజధానుల బిల్లులకు ఏపీ హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే.
దీనిపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అయితే దానిపై సోమవారం విచారణకు వస్తుందని అంతా భావించారు. కానీ, విచారణకు రాకపోవడంతో ఈరోజే అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్ కో’ని ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కాపీని కెవియట్ వేసిన వారికి పంపినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది.
ప్రతివాదులకు పిటిషన్ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది.
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం రాజపత్రం కూడా విడుదల చేసింది.
దీనిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై కోర్టు స్టేటస్ కో విధించింది. ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.