రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకే ఆ సబ్సిడీ డబ్బు జమ


ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. విద్యుత్ చార్జీలను నేరుగా అకౌంట్లలోకే బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది.
రైతులతో సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో శుభవార్త చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు నేరుగా అకౌంటర్లలో జమచేయనున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఉచిత విద్యుత్‌ సబ్సిడీని నెలవారీ నగదు రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం చెల్లించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వినియోగం మేరకు వచ్చిన బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాలు హామీల్లో భాగంగా ఉచిత విద్యుత్తుకు రూ.8,400 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ పథకం కోసం రాష్ట్రంలోని సుమారు 18 లక్షల రైతులకు ఏటా 12 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించింది. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు వీలుగా రూ.1,700 కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రం సూచనలకు అనుగుణంగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *