ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఘట్టం

నువ్వు కొన్ని వందల అడుగులు వెయ్యి…వేల అడుగులు వెయ్యి, లక్షల అడుగులు వెయ్యి…ఏ మహా యాత్ర అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది . ఆ అడుగులు పిడుగులలా, ప్రళయఝOఝలా ప్రజలు మారుస్తారు నీలో చిత్తశుద్ధి ఉన్నట్లయితే….
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు…డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిల ..మళ్ళీ నేడు వైఎస్ జగన్! ఇది యాదృచ్ఛికమే కావచ్చు.. కానీ, ఒక అసంభవమైన అద్భుతం! భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ కుటుంబం నుంచి ఇలాంటి అపూర్వఘట్టాన్ని ప్రజలు తిలకించలేదు.
ఎంత దీక్ష కావాలి! ఎంత పట్టుదల కావాలి! ఎంత ఉక్కుసంకల్పం కావాలి!!! అవి అన్నీ ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సొంతం అనిపించేలా సాగిన ఆ మహాపాదయాత్ర అనితరసాధ్యం..
ఒక దుర్మార్గపు నియంత పాలనలో దోపిడీ, దుర్మార్గం, అవినీతి అక్రమం, భూకబ్జాలు, ఎదురు తిరిగినవారిని భౌతికంగా దాడి చెయ్యడం, అధికారులను మహిళలు అని కూడా చూడకుండా, ఎమ్మెల్యేలే జుట్టుపట్టుకుని కొట్టడం, ఐపీఎస్ అధికారులను సైతం కాలర్ పట్టుకోవడం, ఇసుక, మట్టి, నీరు, గాలి ధూళి కూడా దోచుకోవడమే. ప్రతిపక్షం లోని ఎమ్మెల్యేలను బెదిరించడం, కొనుగోలు చెయ్యడం, కేసులు పెట్టడం, ప్రజాస్వామ్యాన్ని మానభంగానికి గురి చెయ్యడం, ప్రజల హక్కులను కాలరాయడం, సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లబోసుకునేవారిమీద కేసులు పెట్టడం, అరెస్ట్ చెయ్యడం, …ఇంత నీచ నికృష్ట పాలన గత అరవై ఏళ్లలో ఎన్నడూ ఎవరూ చూసి ఉండరు.
అందుకే అతడు…
పతితులారా..భ్రష్టులారా…బాధాసర్పద్రష్టులారా…
ఏడవకండి ఏడవకండి..వస్తున్నాయి వస్తున్నాయి
జగన్నాధ రథచక్రాల్ వస్తున్నాయి …
అని కేసరిలా గర్జిస్తూ ఇడుపులపాయలో 6 -11 -2017 పంజా విసిరాడు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి. చిన్న చిన్న బిందువులు సెలయేరులా మారినట్లు ఆ ఒక్కడి వెంట వందలమంది ప్రజలు నడిచారు. రెండు జిల్లాలు దాటేసరికి వేలమంది అనుసరించారు.
రాయలసీమలో వైసిపికి బలం ఉన్నది కాబట్టి ఆమాత్రం జనం సహజమే అనుకున్నారు ప్రత్యర్ధులు. కానీ, నెల్లూరు వచ్చేసరికి జనం పెరిగిపోయారు. ప్రకాశం వచ్చేసరికి ప్రళయగోదావరి కనిపించింది.
గుంటూరు, కృష్ణా జిల్లాలు చౌదరిల సామ్రాజ్యమ్ కాబట్టి అక్కడ జనం పల్చబడతారని సంబరపడ్డారు తెలుగుదేశం వారు. కానీ, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా జనసముద్రం కనిపించింది. కృష్ణా జిల్లాలో జగన్ కు కనీవినీ ఎరుగని స్వాగతం లభించింది. ప్రకాశం బారేజ్ వణికిపోయింది ఆ మహా ప్రళయానికి. కిందనే కృష్ణా నది…వారధి మీద సాగరం! ఆ దృశ్యాన్ని చూడటానికి వేయి నయనాలు కూడా సరిపోలేదు. కృష్ణా జిల్లాలో లభించిన కర్పూర నీరాజనాలు చూసి ఆనందబాష్పాలు రాల్చిన జగన్…తన శత్రువు మామగారు అయినప్పటికీ, ఆ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తానని ప్రకటించి తన విశాలహృదయాన్ని విశ్వరూపంలో చూపించారు.
ఇక గోదావరి జిల్లాలు అయితే సునామీలా పోటెత్తాయి. అసలు అంత జనం జిల్లాల్లో ఉన్నారా అనిపించేంతగా..శ్రీరాముడివెంట అయోధ్య వాసులు అందరూ పరిగెత్తినట్లుగా ప్రజలు జగన్ కు జయజయధ్వానాలు చేశారు. రాజమండ్రి వారధి నర్తించింది తన శిరస్సును అలంకరించిన నలభైవేల పాదాలను మోస్తూ…
విశాఖలో వైసిపి బలంగా లేదని భావించారు అప్పట్లో. కానీ, ఆ వాదనను పూర్వపక్షం చేస్తూ..విశాఖలో జనం సముద్రాన్ని తలపించారు. విశాఖలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసంఖ్య లక్షను దాటింది. ఆ సభలో జగన్ సింహనాదం సముద్రాన్ని కూడా కదిలించింది అంటే అతిశయోక్తి లేదు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా జగన్ కు మంగళహారతులు పట్టాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా కనీసం యాభైవేలమంది హాజరు అయ్యారు. జగన్ ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు. చంద్రబాబు అసమర్ధపాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ ఘనవిజయాన్ని సాధించారు అని చెప్పాలి.
మధ్యలో విశాఖపట్నంలో జగన్ ను భౌతికంగా అంతమొందించడానికి తెలుగుదేశం నాయకులు కుట్ర చేశారు. కోడి కత్తితో విమానాశ్రయంలో జగన్ ను నిర్మూలించడానికి పధకం పన్నారు. శ్రీమతి భారతి మంగళసూత్రాలు గట్టివి కావడంతో జగన్ తృటిలో తప్పించుకున్నారు. నిజానికి మరొకరు అయితే, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కనీసం పదిరోజుల సమయాన్ని తీసుకునేవారు. పాదయాత్రకు స్వస్తి చెప్పేవారు. కానీ, జగన్ వజ్రసంకల్పుడు. అందుకే ఆ ప్రయత్నం ఆయన శిరోజాన్ని కూడా ఊడబెరకలేకపోయింది. కుక్కలు అరిస్తే, కుందేళ్లు బెదురుతాయేమో కానీ, గజరాజులు చలిస్తాయా? జగన్ ను తక్కువ అంచనా వేశారు శత్రువులు. ఆ కుట్ర వెనుక ఉన్న హస్తాలు ఎవరివో అందరికీ తెలుసు. రుజువు కావడానికి సమయం పడుతుంది. దోషులు తప్పించుకోలేరు.
మొత్తం 341 రోజులు, 3650 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు! జగన్ పాదస్పర్శతో పులకించాయి. కోటిన్నరమంది జనాన్ని ప్రత్యక్షంగా కలిశారు. వేలమంది సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. మొత్తం 124 బహిరంగసభలు జరిగాయి. 55 ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఈ చరిత్రను తిరగరాయడం ఈ యుగంలో మరొకరికి సాధ్యం కాదు…కాదంటే కాదు. సుమారు పదునాలుగు మాసాల పాటు జగన్ నిర్వహించిన ఈ పాదయాత్ర నభూతో నభవిష్యతి….
ఒక సంవత్సరం మొత్తం పాదయాత్రలో గడిపిన రాజకీయనాయకుడు దేశచరిత్రలో జగన్ ఒక్కడే. ఆరు రుతువులు ఆయనకు ఆమనులు అయ్యాయి. మండే ఎండలు పండు వెన్నెలలు అయ్యాయి. జగన్ దీక్షను చూసి చలి దేవతకే చలివేసి వణుకు వచ్చింది. వర్షాలు అతనిని ఆపలేక పోయాయి. ఇడుపులపాయలో మొదలైన యాత్ర ఇచ్ఛాపురంలో నేడు ముగియబోతున్నది.
ఎవరు రాబోయే రోజుల్లో జగన్ అనే జగమొండిని ఆపగలిగేది? ఎవరికైనా దమ్ముందా? మరో నాలుగు నెలల్లో అతను ఆఁధ్రప్రదేశ్ భాగ్యవిధాత అవుతాడు. కేంద్రంలో కీలకపాత్రను పోషిస్తాడు. ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తాడు. ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు.
ఇది తధ్యము సుమతీ!
Credits : Murali Mohan Rao Ilapavuluri