40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు ఇలా అబద్ధాలు ఆడటం సబబేనా? అని సీఎం జగన్ నిలదీశారు…

మంచి చేస్తుంటే అభాండాలు వేస్తున్నారు.. జగన్ ఆవేదన

మంచి జరుగుతుంటే అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు బండలు వేస్తున్నారని జగన్ ఆరోపించారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలను ఎక్కడైనా తెరిచామా? అని ప్రశ్నించారు.

గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? పోలీసుల్ని పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ… గాంధీ జయంతికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఏపీ సర్కారును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రశ్నలకు సీఎం జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏలూరులో శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన ఆయన.. చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్నారు.

‘ఈ ప్రభుత్వం గాంధీ జయంతి నాడు మద్యం దుకాణాలను తెరిచిందని చంద్రబాబు అభాండాలు వేస్తున్నారు. గాంధీ జయంతి నాడు మద్యం షాపులు ఎక్కడైనా తెరిచామా?’ అని జగన్ ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు ఇలా అబద్ధాలు ఆడటం సబబేనా? అని సీఎం నిలదీశారు. ఇలాంటి రాజకీయాల మధ్య మీ ముఖాలను చూసినప్పుడు సంతృప్తి కలుగుతుందని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

మంచి జరుగుతుంటే అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు బండలు వేస్తున్న విషయాన్ని జనం గమనిస్తున్నారని జగన్ తెలిపారు. గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలను ప్రారంభించాం. రెండు వేల జనాభా ఉన్న ప్రతి చోట గ్రామ సచివాలయం వచ్చింది. అంటే ప్రతి ఊరికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇచ్చామని సీఎం తెలిపారు. గాంధీ జయంతి రోజున గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి నాంది పలికామన్నారు.

గాంధీ జయంతి రోజున నూతన మద్యం పాలసీని తీసుకొచ్చామన్న సీఎం.. గతంలో ప్రతి ఊళ్లో నీళ్లు దొరక్కపోయినా.. బెల్ట్ షాపు కచ్చితంగా కనిపించేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్టు షాపులను నిషేధించామన్నారు. 4500 మద్యం షాపులను 20 శాతం తగ్గించామన్నారు. మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూమ్‌ లేకుండా చేశామన్నారు. మంచి చేయడానికి తాము తాపత్రయ పడుతుంటే.. చంద్రబాబు విమర్శిస్తున్నారని జగన్ అసహనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *