జగన్ దూకుడు!… బెంబేలెత్తిపోయిన టీడీపీ

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగారా మోగిన వేళ… ఏపీలోని విపక్షం వైసీపీ నిజంగానే దూకుడుతో ముందుకెళుతోందని చెప్పక తప్పదు. వరుసగా అనివార్యమైన అడ్డంకులు ఎదురవుతున్నా… ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగుతున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా స్పష్టమైన వైఖరితోనే కాకుండా తనదైన దూకుడును ప్రదర్శిస్తూ వైరి వర్గాలకు.. ప్రధానంగా అధికార పార్టీ టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారనే చెప్పాలి.

అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికలపై చాలా ముందు నుంచే స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్న జగన్… ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తొలి జాబితాలోనే మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 ఉంటే… వాటిలో ఏకంగా ఒకే విడతలో 150కి పైగా స్ధానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం సాగింది.

ఈ వార్తలతో బెంబేలెత్తిపోయిన టీడీపీ… వైసీపీ కంటే ఓ అడుగు ముందుండాలని భావించి… అభ్యర్థుల జాబితా విడుదలలో తనదైన మార్కును చూపే యత్నం చేసింది. ఈ క్రమంలోనే తొలి విడతలోనే ఏకంగా 126 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు… వైసీపీకి షాకిచ్చినట్టుగానే భావించారు.

అయితే చంద్రబాబుతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగే రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్… మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పక తప్పదు.

నేటి ఉదయం హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. అంతేకాకుండా ఎంపీ సీట్లకు కూడా టోటల్ జాబితాను ప్రకటించిన జగన్… అధికార పార్టీకి మరో గట్టి షాకిచ్చినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

సంప్రదాయానికి భిన్నంగా అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున విపక్షంలోకి వలస
వెల్లువెత్తుతుంగా… సీట్ల కేటాయింపు అభ్యర్థుల సర్దుబాటు జగన్కు తలకు మించిన భారంగానే అంతా పరిగణించారు.

కొత్త నేతల చేరిక పార్టీ నుంచి వెళ్లి తిరిగి వస్తున్న నేతలు అప్పటికే చాలా మందికి హామీ ఇచ్చిన నేపథ్యంలో… సీట్ల కేటాయింపు జగన్కు కత్తి మీద సామేనని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ జగన్…. మొత్తం అన్ని స్థానాలకు… ఇటు అసెంబ్లీ సీట్లతో పాటు అటు ఎంపీ సీట్లకు కూడా సింగిల్ జాబితాలోనే అభ్యర్థులను ఖరారు చేశారు.

అభ్యర్థుల ఖరారులో వైఎస్ జగన్ అనుసరించిన వ్యూహం కూడా అటు పార్టీలోనే కాకుండా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఖరారులో ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరించకుండా.. ఎంత మంది కొత్త నేతలు పార్టీలో చేరుతున్నా కూడా జగన్ తనదైన స్పష్టమైన వైఖరితోనే ముందుకు సాగుతున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

జగన్ ఎంత పకడ్బందీగా వ్యవహారం నడిపారన్న విషయం కూడా

జాబితాలోని కొందరు అభ్యర్థులు అయితే…తమకు ఈ మేర చోటు దక్కుతుందని ఊహించలేదని చెబుతున్నారంటే… జగన్ ఎంత పకడ్బందీగా వ్యవహారం నడిపారన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. అభ్యర్థుల ఖరారులో నానా పాట్లు పడుతున్న వైనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే.

ఓ వైపున పార్టీలో విన్నింగ్ కేండిడేట్లుగా ఉన్న కీలక నేతలంతా ఒకరి తర్వాత మరొకరుగా పార్టీని వీడుతూ నేరుగా విపక్షంలో చేరిపోతుంటే… ఆయా స్థానాలకు అభ్యర్థులు లేక ఎన్నికల్లో నిలిచే సత్తా ఉన్న నేతలెవరంటూ చంద్రబాబు దిక్కులు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది.

మరోవైపు చాలా మంది సిట్టింగ్ లకు ఈ దఫా సీట్లిస్తే… సహించేది లేదంటూ పార్టీ కేడర్ ఉరుముతున్న తీరుతోనూ చంద్రబాబు బాగానే భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జవహర్ లాంటి మంత్రి స్థాయి నేతకు ఈ దఫా వేరే సీటుకు మార్చారన్న వాదన సాగుతోంది. మొత్తంగా దూకుడు పెంచాల్సిన అధికార పక్షం డంగైపోగా… అధికార పక్షం వైఖరిని చూస్తూ దానికి అనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తుందని భావిస్తున్న విపక్షం తనదైన శైలి దూకుడుతో ఏకంగా అధికార పక్షానికి ముచ్చెమటలు పోయిస్తున్న పరిస్థితిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *