వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా… రాజధానిని తరలిస్తారా… నారా లోకేష్ మాటల్లో నిజమెంత

అమరావతిలో ఒక్క ఇటుక కూడా కట్టలేదంటున్న వైసీపీ… రాజధానిని వేరే చోటికి తరలిస్తుందా?
సినీ నటుడు శివాజీ చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ… నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో పాత చర్చను మరోసారి తెరపైకి తెచ్చి కొత్తగా చర్చ జరిగేలా చేస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే… అమరావతి నుంచీ రాజధాని తరలిపోతుందని శివాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇంతకుముందు ఆయన చెప్పిన రకరకాల పురాణాలు నిజమేనని నమ్మిన టీడీపీ నేతలు… ఇప్పుడు ఆమరావతిపై ఆయన అభిప్రాయం కూడా నిజమేనన్నట్లు మాట్లాడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకైన నారా లోకేష్ తనదైన శైలిలో దీనిపై కామెంట్లు చేశారు. జలందర్నీ ఒప్పించి అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నామనీ… వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు.
ఉండవల్లిలో జరిపిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన… రాజధానిని మరోచోటికి తరలించాలన్న కుట్ర వైసీపీ మేనిఫెస్టో ద్వారా బయటపడిందని అన్నారు లోకేష్.
ఒకే సమయంలో ఇటు శివాజీ, అటు నారా లోకేష్ ఇద్దరూ రాజధానిని వైసీపీ వేరే చోటికి తరలించేస్తుందని అనడం కొత్త చర్చకు తెరతీసింది. ఐతే… గతేడాది కూడా ఈ అంశం తీవ్ర కలకలమే రేపింది.
అప్పట్లో కృష్ణా, గుంటూరు ప్రజలు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో స్వయంగా వైసీపీ అధినేత జగనే ప్రజలందరి మధ్యా కీలక ప్రకటన చేశారు.
రాజధానిగా అమరావతే ఉంటుందనీ, దాన్ని మార్చే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం తమ వంశంలో లేదని ఆయన పదే పదే అంటుంటారు.
అందువల్ల అప్పట్లో ప్రజలు జగన్ మాట నమ్మి సర్దుకుపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ సమయంలో రాజధాని తరలింపు అంశం మళ్లీ ఆ రెండు జిల్లాల్లో గుబులు రేపుతోంది.
రాజధానిని తరలించాలని ఏ పార్టీ భావించినా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అలాంటి నిర్ణయం తీసుకునే ఏ పార్టీనైనా వారు వంద శాతం వ్యతిరేకిస్తారు. ఇప్పుడు నారా లోకేష్ మాటలు, శివాజీ కామెంట్లు నిజమని ఆ జిల్లాల ప్రజలు నమ్మితే… అది వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల వైసీపీ అధినేత జగన్ మరోసారి ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చెయ్యాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులే సమయం ఉంది.
ఇలాంటి టైంలో అమరావతిపై వైసీపీ స్పష్టమైన హామీ ఇవ్వకపోతే… ఆ రెండు జిల్లాల ప్రజలూ వైసీపీ పట్ల వ్యతిరేక భావనను పెంచుకునే ప్రమాదం ఉంటుంది. వారిలో అనుమానాలు, సందేహాల్ని వైసీపీ ఎంత ఎక్కువగా నివృత్తి చెయ్యగలిగితే, అంతగా ఆ పార్టీ రాజకీయంగా జరిగే నష్టం నుంచీ బయటపడగలదంటున్నారు ఎనలిస్టులు.
ఇదంతా టీడీపీ వ్యూహంలో భాగమేననీ, సరిగ్గా టైం చూసి… వైసీపీని దెబ్బకొట్టేందుకే ఈ ఆందోళనక ప్రకటనలు చేయిస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా అమరావతి తరలింపు అంశం మళ్లీ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.