104, 14410 కాల్‌ సెంటర్లు అవి పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే..సీఎం జగన్ కీలక ఆదేశాలు


కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా బాగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 104, 14410 కాల్‌ సెంటర్లు సమర్థంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ రెండు నంబర్లు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కాల్‌ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 కరోనా ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం, పారిశుద్ధ్యంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. దీంతో కరోనా బాధితులకు కచ్చితంగా మెనూ అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్‌ చేసి సేవలపై ఆరా తీయాలని అధికారులకు సూచించారు.

అప్పుడప్పుడు కాల్‌చేసి అవి పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని జగన్‌ పేర్కొన్నారు.

కాల్‌ సెంటర్‌ సేవలపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని.. ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలన్నారు.

ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు.

అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద కరోనాకు సంబంధించిన హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్‌లో ఉండాలని.. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఇందులో గ్రామ, వార్డు వలంటీర్ల భాగస్వామ్యం కూడా ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోవాలని, ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *