నాకు కులం లేదు:ఎన్నికల హామీలు ప్రకటించిన జనసేన అధినేత

  • నా దగ్గర డబ్బు లేదు
  • నేనో కానిస్టేబుల్ కుమారుణ్ణి
  • కులాలను కలిపేదే జనసేన
  • ఆవిర్భావసభలో పవన్‌కల్యాణ్
  • ఎన్నికల హామీలు ప్రకటించిన జనసేన అధినేత

తాను కాపుకులానికి చెందిన వాడినని అందరూ అంటున్నారని, అయితే తనకు కులం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కులాలను కలిపేది జనసేన అని, విడదీసేది కాదని పేర్కొన్నారు.

2014లో ఏమీ ఆశించకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. తాను సీఎం కుమారుడిని కాదని, ఓ సాదాసీదా కానిస్టేబుల్ కుమారుణ్ణి అన్నారు.

పవన్ బలం గోదావరి జిల్లాల్లోనే అని కొందరు అంటున్నారని, అది తప్పని నిరూపిస్తానని చెప్పారు. సీమలోనూ బలం ఉందని తొడగొట్టి చెప్పాలా? అని ప్రశ్నించారు.

జనం కోరితే తెలంగాణలోనూ రాజకీయాలు చేస్తానని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొందరు నీచంగా చూశారని, ఏపీలో రాజకీయం రెండు కులాల మధ్యే ఊగిసలాడుతున్నదని ఆరోపించారు.

రైతులపై వరాల జల్లు

రైతులపై పవన్‌కల్యాణ్ వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడితోపాటు 60 ఏండ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు రూ.ఐదు వేల పింఛను, రైతులకు ఉచితంగా సోలార్ మోట ర్లు ఇస్తానని చెప్పారు.

కనీసమద్దతు ధర పరిధిలోకి రాని పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల ఆరోగ్యబీమా అందిస్తామని, పోలీసులకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తామని, ముఖ్యమంత్రి పదవిని లోకాయుక్త పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, అధికారం చేపట్టిన ఆర్నెళ్లలో లక్ష ఉద్యోగాలు, ఐదేండ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు ఏడాదిలో ఒకేసారి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, డొక్కా సీతమ్మ క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం కల్పిస్తామని వెల్లడించారు.

బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు, నదుల అనుసంధానం.. కొత్త జలాశయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రెండేండ్లలోపు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని, ముస్లింల అభ్యున్నతికి సచార్‌కమిటీ సిఫారసులను అమలు చేస్తామన్నారు.

అసెంబ్లీ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌సిలిండర్లు అందిస్తామని వివరించారు.

అన్ని పండుగల్లో చీరలు పంపిణీ చేస్తామని, మహిళా ఉద్యోగులకు శిశుసంరక్షణ కేం ద్రాలు ఏర్పాటు చేస్తామని, మహిళలకు పావలావడ్డీకే రుణాలిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *