రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? అంటూ మంత్రి ప్రశ్నించారు…

అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ప్రకటించిందా? మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేసి, దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోంది.

రాజధాని తరలింపు అంశంపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? అంటూ మంత్రి ప్రశ్నించారు.

సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశంపై వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని, ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? మూడు రాజధానులనేవి ఆలోచన మాత్రమేనని వ్యాఖ్యానించారు.

అమరావతిని ఎవరూ తరలించడం లేదని, చంద్రబాబులా భ్రమరావతిని సృష్టించక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలే మాట్లాడారని మంత్రి వెల్లంపల్లి అన్నారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే, దీనికి పవన్‌ కళ్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి, చంద్రబాబు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదని విమర్శించారు. నిన్నటిదాకా విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న పవన్‌, ఇప్పుడు మంగళగిరిలో రైతులతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం కాదని, ముందు విజయవాడకు మకాం మార్చుకోవాలని ఆయన సూచించారు. అతిథిలాగా ఒకటి, రెండు రోజులు ఇక్కడికొచ్చి సినిమా డైలాగ్‌లు చెబితే ప్రజలు నమ్మరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మంత్రితోపాటు ఎమ్మెల్యే జోగి రమేశ్, మల్లాది విష్ణులు ఈ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ రంగులు, వేషాలు మార్చుకోడానికి తప్ప రాజకీయాలకు పనికిరారని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. రెండుచోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పిచ్చితుగ్లక్‌ మాకు చెబుతారా? అంటూ ధ్వజమెత్తారు. పవన్‌ గంటకొకలా మాట్లాడుతారని.. ఆయనకు సరైన విధానం లేదని మల్లాది విష్ణు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *