మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ ధరించకుంటే జరిమానా ప్రజలకు మాత్రం.. మాస్కులు లేకుండా ప్రభుత్వ పెద్దలు…

ఎవరైనా బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చిరించింది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం దీన్ని విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటి వరకు అలాగే పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,720 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే, పదే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్ర్తత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతోంది. ముఖ్యంగా బయటకు వచ్చేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటోంది.

కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ సూచనలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా కొందరు ప్రభుత్వ పెద్దలు మాస్కులు లేకుండానే దర్శనమిచ్చారు.

మరోవైపు ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మాస్కులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.

కాగా, ఇటీవలే ఇకపై ఎవరు బయటకు వచ్చినా మాస్కులు పెట్టుకోకపోతే జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ఎవరైనా మాస్క్ పెట్టుకోక పోతే గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాల్లో అయితే రూ.1,000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి దగ్గరకు చేరాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మాస్కులు ధరించాలంటూ ఓవైపు ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుండగా..

ఈ నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు వర్తించవా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *