ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని..రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

తేల్చుకుందాం, ఎన్నికలకు రెడీగా ఉండు.. రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ తదితరులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై త్వరలోనే అనర్హత వేటు పడుతుందని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ఎంపీలు సవాల్ విసిరారు. రఘురామ పూర్తిగా నైతిక విలువలు కోల్పోయారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల బృందం మీడియాతో మాట్లాడింది. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.

పార్టీ నేతలను దూషిస్తూ ప్రతిపక్షాలతో లాలూచీ పడినట్లుగా ప్రవర్తించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయనకు ఏమైనా అనుమానాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి ఉండాల్సిందన్నారు.

ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారని, ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

మనసా, వాచా అతను వైఎస్సార్‌సీపీతో లేరని, స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రఘురామ కృష్ణంరాజుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామ కృష్ణంరాజు చర్చించలేని.. టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఎంపీ నందగం సురేష్ మాట్లాడుతూ.. రఘురామ కృష్ణంరాజు కుంటిసాకులు మానుకోవాలని సూచించారు.

ధైర్యం ఉంటే స్పీకర్ అనర్హత వేటు వేయకముందే.. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో తెలుస్తుందని సవాల్ విసిరారు.

మీ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి.. బడగు బలహీనవర్గాల ప్రజలు తెలుగు మీడియంలో చదవాలా? అని ఎంపీ భరత్‌ రఘురామ కృష్ణంరాజును ప్రశ్నించారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, ప్రజా క్షేత్రంలో త్వరలోనే తేల్చుకుందని సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *