టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద‌రెడ్డి గుడ్ బై…

టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి. పార్టీలో తనకు ఐదేళ్లుగా తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వ‌లేద‌ని ఆవేదన. పార్టీలో కొనసాగలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్న మెట్టు.

1.టీడీపీ నుంచి రాయదుర్గం సీటు ఆశించిన మెట్టు గోవిందరెడ్డి.

2.బుజ్జగించే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గని గోవిందరెడ్డి.

3.త్వరలోనే మెట్టు వైసీపీలో చేరే అవకాశం.

ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీల్లో టికెట్ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది.

ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉండటం ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి మొదలయ్యింది. సీటుపై హామీ రాకపోవడంతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు.

తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీ సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

గోవింద‌రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు రంగంలోకి దిగారు.

ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. పార్టీకి రాజీనామా చేశారు.

అనంత‌పురం జిల్లాలోనూ, రాయ‌దుర్గంలోనూ కష్టకాలంలో పార్టీకి పనిచేశానన్నారు మెట్టు.

కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉండి పార్టీని నిలబెట్టిన త‌న‌కు ఐదేళ్లుగా తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో కొనసాగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గోవిందరెడ్డి చెప్పారు.

మెట్టు గోవిందరెడ్డి 2003లో టీడీపీలో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2009లో తిరిగి పోటీచేసి ఓడిపోయారు.

2014లో రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేయడంతో మెట్టు తప్పుకున్నారు. దీంతో ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలని భావిస్తున్న మెట్టు.. మళ్లీ సీటు దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed