వైసీపీలోకి వంగా గీత.. కాకినాడలో రసకందాయం!

మాజీ ఎమ్మెల్యే వంగా గీత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె చేరికతో కాకినాడలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం (మార్చి 16) సాయంత్రం లోటస్ పాండ్‌‌లో వైఎస్‌ జగన్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు.

జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు మెండుగా అందుతాయని వంగా గీత విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుందని ఆకాక్షించారు.

రాబోయే కాలంలో జగన్ నాయకత్వంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ అందుతాయని అమె అన్నారు..

ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వంగా గీత అన్నారు.

యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. మహిళలు, పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.

అందుకే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని.. అందుకోసం తామంతా సైనికుల్లా పనిచేస్తామని ఆమె చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత.. ఫిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆమె తటస్థంగా ఉన్నారు.

చాలా ఏళ్ల తర్వాత వైసీపీలో చేరి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వంగా గీత వైసీపీలో చేరడంతో కాకినాడలో రాజకీయం రసకందాయంలో పడింది.

వైసీపీ తరఫున వంగా గీత కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే వైసీపీలో చేరిన మరో నేత తోట నరసింహం నుంచి ఆమెకు మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం.

కాకినాడ స్థానానికి టీడీపీ నుంచి చెలమశెట్టి సునీల్‌కు టికెట్ ఖాయమైంది.

2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలవడం గమనార్హం. దీంతో సునీల్‌కు ప్రజల్లో సానుభూతి ఉంది.

ఇదే సమయంలో ఆయన టీడీపీలోకి మారడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. వైసీపీలోకి తిరిగొస్తే.. ప్రజలు ఘన విజయం కట్టబెడతారని వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *