ఎన్నికల టైం జంపు జిలానీల హవా! పార్టీలు మార్చేందుకు రెడీ అవుతున్న నేతలు._

ఎన్నికల తరుణంలలో తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి పలువురు నేతలు జంప్‌ జిలానీలు పార్టీ ఫిరాయింపులకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ సమీపించేకొద్దీ ఫిరాయింపుల జోరు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో వరకూ అధికార టీడీపీలోకి భారీగా వలసలు సాగాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. టిడిపి నుండి వైకాపాలోకి ఫిరాయింపులకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగుదేశంలో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారితో పాటు టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వివిధ అంశాల ప్రాతిపదికన వైకాపా వైపు చూస్తుండటం గమనార్హం!

కోత ఫిరాయింపులకు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీగా అమలాపురం నుండి పోటీచేసి పండుల విజయం సాధించారు.

తాజాగా ఆయన అనూహ్యంగా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖజిల్లా పాయకరావుపేట (ఎస్సీరిజర్వ్డ్‌) స్థానం నుండి పోటీచేస్తారని భోగట్టా! మంత్రి పదవిపై మనసు పారేసుకున్న పండుల వైకాపా ద్వారానే అది సాధ్యమవుతుందన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం.

ఫిరాయింపు దిశగా తోట ధ్వజం…

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఖరిపైనా ఉత్కంఠ సాగుతోంది. ఎంపీ తోట వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని ఆశిస్తున్నారు.

తోట అనారోగ్యం కారణంగా తన భార్య వాణి పోటీచేస్తారని తెలుస్తోంది. ఆ మేరకు జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాల్సిందిగా ఇటీవల అధినేత చంద్రబాబుకు సతీసమేతంగా తోట విన్నవించారు.

జగ్గంపేట బరిలోకి జ్యోతుల నెహ్రూను దించేందుకు చంద్రబాబు నిర్ణయించడంతో తోట ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తోటను వైకాపా ముఖ్యనేత బొత్స సత్యనారాయణ ను స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది!

అంటే జగ్గంపేట నుండి నరసింహం లేక ఆయన భార్య వాణి వైకాపా అభ్యర్ధిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రామచంద్రపురం టీడీపీ పమ్మెల్యే తోట త్రిమూర్తులు జంప్‌ జిలానీగా అవతరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం!

తోట 1994లో తెలుగుదేశం రెబల్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. 1999లో తెలుగుదేశం అభ్యర్ధిగానూ విజయం సాధించారు. ఈ రెండు పర్యాయాలూ తెలుగుదేశంలో అధికారంలో ఉంది.

2004లో టీడీపీ తరఫున, 2009 పీఆర్పీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 2012లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తిరిగి గెలుపొందారు.

వైకాపానేత పిల్లి బోసుకు స్వంత సామాజికవర్గం (రామచంద్రపురం)లో పట్టులేకపోవడంతో తోటను గెలుపు అవకాశాలున్న అభ్యర్ధిగా భావించాల్సి వస్తోంది. నిజానికి విద్యావంతుల్లోనూ, ఇతర ఆగ్రకులాల్లోనూ త్రిమూర్తులు పట్ల వ్యతిరేకత ఉంది.

పిల్లి బోసు పై వ్యతిరేకత… కలసివచ్చిన తోట

అయితే రామచంద్రపురంలో పిల్లి బోసుపై ఉన్న వ్యతిరేకత తోటకు 2012, 2014 ఎన్నికల్లో కలసివచ్చింది. 2012లో ఓటమి చెందినప్పటికీ తిరిగి 2014లో పార్టీ అభ్యర్ధిగా బోసును బరిలోకి నిలపడంతో వైకాపాకు పరాజయం పాలైయరు…

దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న విద్యావంతులు, సేవాతత్వరులైన వైద్య దంపతులకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ పార్టీ వీరిని పరిగణలోకి తీసుకోకపోగా పార్టీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించేవారిని నమ్మి బలహీన అభ్యర్ధులను బరిలోకి దించడంతో వైకాపాకు పరాజయం తప్పడంలేదు! ఓటమి పాలైన స్థానికేతరుడికి నియోకవర్గ బాధ్యతలు అప్పగించడం కూడా వైకాపాకు మైనస్‌కాగా తోటకు ప్లస్‌ అవుతోంది.

తోటపై దళితుల శిరోముండనం కేసు నేటికీ కత్తిలా వేలాడుతునే ఉంది. తోటకు దుందుడుకు స్వభావం కలిగిన నేతగా ఆరోపణలున్నాయి. 2014లో తెలుగుదేశం మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి పెద్దఎత్తున తన అనుచరులను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తోట తరలించారు.

తీరా మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఆగ్రహంతో తన కేడర్‌ను వెంటబెట్టుకుని ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే రామచంద్రపురానికి తిరుగు పయనమయ్యారు.

తర్వాత ఈ అంశం చంద్రబాబు దృష్టికి వెళ్ళగా తోటను మందలించినట్టు సమాచారం! ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న తోట వైకాపాలో చేరితేనే తన కోరిక నెరవేరవచ్చన్న ఆలోచనతో ఉన్నట్టు భోగట్టా! హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తోన్న పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితీ ఇదే విధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు టిక్కెట్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

చినరాజప్పకు టిక్కెట్‌ ఇచ్చిన పక్షంలో వైకాపా నుండి బరిలోకి దిగే యోచనలో బొడ్డు ఉన్నట్టు సమాచారం! ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కూడా వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతుకావడం తథ్యమని తెలుస్తోంది.

సుబ్బారావు స్థానే ఆయన దగ్గర బంధువు వరుపుల జోగిరాజు (రాజా)కు టిక్కెట్‌ కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం! ఈ విషయం తెలిసిన సుబ్బారావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *