దర్శకుడు కోడి రామకృష్ణకు తీవ్ర అస్వస్థత

దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

వెటరన్ దర్శకుడు కోడి రామకృష్ణ ఆరోగ్యం ఆందోళనకరం.

గతంలో పెరాలసిస్ బారినపడి కోలుకున్న దర్శకుడు.

మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు, అభిమానుల ఆందోళన.

గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం (ఫిబ్రవరి 21) ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

కోడి రామకృష్ణ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వార్త టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. పలువురు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. గతంలో పెరాలసిస్‌తో కొంత కాలం బాధ పడిన కోడి రామకృష్ణ.. ఆ తర్వాత కోలుకున్నారు.

ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

విలక్షణ దర్శకుడైన కోడి రామకృష్ణ.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.

టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా. తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరసలో ఉంటారు.

‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. మధ్యతరగతి జీవితాలను.. అందులోని ఒడుదొడుకులను కథా వస్తువుగా ఎంచుకుని కోడి రామకృష్ణ సినిమాలన ఎంచుకుని కోడి రామకృష్ణ సినిమాలను రూపొందించారు.

తనదైన శైలిలో కథ చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను కూడా తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి సినిమాలే అందుకు ఉదాహరణ.

మువ్వ గోపాలుడు, పెళ్లి, శత్రువు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కోడి రామకృష్ణ తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరీర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు.

సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆశిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *