YS Jagan: ఇబ్బందులు తప్పవు.. ఆలోచించుకో.. కేసీఆర్ పరోక్ష సంకేతాలు..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో కేంద్రం తీరుతో అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రం సీఎం వ్యవహరిస్తున్న తీరు కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నారని అర్థమవుతోంది.

ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య చక్కటి సన్నిహిత సంబంధాలున్నాయి. వ్యక్తిగతంగా కేసీఆర్, జగన్ ఇప్పటికీ మిత్రులే. కానీ రాష్ట్రాల ప్రయోజనాల దగ్గరకు వచ్చే సరికి ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగింది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచి.. సీమకు నీళ్లు అందించాలన్న జగన్ నిర్ణయం పట్ల తెలంగాణ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఆగష్టు 5న ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి చర్చలు జరపాలని కేంద్రం భావించింది.

ఆ రోజు సమావేశంలో పాల్గొనే విషయమై మీ అభిప్రాయం చెప్పండంటూ రాష్ట్రానికి లేఖ కూడా రాసింది.

కానీ ఆ రోజు వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనడానికి తెలంగాణ సీఎం సుముఖంగా లేరు.

ఆగష్టు 5న వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల మీటింగ్ తేదీని ఆగష్టు 20కి వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం.

భేటీ వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ..

గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అంతే కాదు తెలంగాణకు రావాల్సిన వాటాలో చుక్క నీటి బొట్టును కూడా తాము వదులుకోబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సాగునీటి రంగం వివక్షకు గురైందని ఆయన చెప్పారు.

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో జలశక్తి మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగష్టు 20న సమావేశం నిర్వహించాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌తో లేఖ రాయాలని ఈ భేటీలో నిర్వహించారు.

వివాదాలు కొనసాగడం ఎవరికీ మంచిది కాదు

ప్రస్తుతం ఏపీతో ఉన్న జలవివాదాలను ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని సెక్షన్ 13 ప్రకారం ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ సర్కారు కోరుతోంది.

కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోన్న కేంద్రం తీరుపట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు.

ట్రిబ్యునల్ పరిధిలో వివాదాలను పరిష్కరించుకోవడమే ఉత్తమమని..

వివాదాలు ఇంకా కొనసాగడం ఇరు రాష్ట్రాలకూ మంచిది కాదని ఈ భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోం..

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.

కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాగా వచ్చే నీటిని పూర్తిగా వాడుకోవాలని.. ఇందుకోసం యుద్ధప్రతిపాదిక ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని తీర్మానించారు.

జగన్ వైఖరి పట్లా అసంతృప్తి.. పరోక్ష సంకేతాలు!

మరోవైపు ఏపీ సీఎం జగన్ వైఖరి పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

నదీ జలాల వినియోగం విషయంలో జగన్ తనతో కలిసి నడవకపోగా.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారనే భావనలో ఆయన ఉన్నారని సమాచారం.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై తెలంగాణలోని ప్రతిపక్షాలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి. జగన్‌తో దోస్తీ వల్లే తెలంగాణ సీఎం సైలెంట్‌గా ఉంటున్నారని విమర్శలు గుప్పించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌తో స్నేహాన్ని కొనసాగిస్తూనే.. చుక్క నీటిని వదులుకోబోం అనడం ద్వారా తన వైఖరిని కేసీఆర్ పరోక్షంగా వెల్లడించారనే భావన వ్యక్తం అవుతోంది.

భేటీలో పాల్గొన్నది వీరే..

ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్,

ప్రభుత్వ చీఫ్ సలహాదారు రాజీవ్ శర్మ, సాగునీటి సలహాదారు ఎస్‌కే జోషి, సీఎంవో సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్,

సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకట రామారావు, రామక్రిష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు నాగేందర్ రావు, నర్సింహ; సుప్రీంలో ప్రభుత్వ కౌన్సిల్ రవీందర్ రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *