సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఆ రెండు వర్గాల్లో కోటి మందికి లబ్ధి

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది.

దీనికి మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని సహా పలు శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రులు ప్రశంసించారు.

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారు అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందని తెలిపారు.

2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.

అలానే 2019- 20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు చేయగా, ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి పొందగా..

రెండు వర్గాల్లో కలిపి మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరిందని అధికారుల సీఎం జగన్‌కు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చామని తెలిపారు.

ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచేనని, సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిదన్నారు.

ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలవుతున్నాయని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుందన్నారు.

వైఎస్సార్‌ ఆసరా కింద కనీసం 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని తెలిపారు.

అలాగే వైఎస్సార్‌ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరబోతోందని వివరించారు.

ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుందని, జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని సీఎం జగన్ తెలిపారు.

మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయన్నారు.

రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *