నెల రోజులు గడువు… రిజర్వాయర్లన్నీ నింపండి… నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సిఎం ఆదేశం

ధ్యాసపెట్టి అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు.

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం వల్ల జలాలు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. మనకు కేవలం నెలరోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుకోగలగాలి. కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయి.

గోదావరిలో వరదలు తగ్గుతున్నాయి. ఆ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కంటెంజెన్సీ ప్లాన్‌ చేయండి అని కలెక్టర్లకు సూచించారు.

అదే విధంగా… ‘ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను సేకరించండి. వాటి పంపిణీలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. కరువుకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం తగిన సహాయం చేస్తుంది. అవినీతి ఎక్కడా ఉండకూడదు.

ఎమ్మార్వోలు, ఎస్సైలు, దిగువస్థాయి అధికారులకు మరోసారి చెప్పండి. ప్రజలెవరైనా వినతులతో వస్తే వారిని చిరునవ్వుతో స్వాగతించండి. కలెక్టర్లు తప్పనిసరిగా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి’ అని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబరు నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *