ఏపీ ఎన్నికల్లో తారల తళుకులు.. టికెట్లు వారికి, ప్రచారం వీరికి!

ఏపీ ఎన్నికల్లో తారలు తళకులీనుతున్నారు.. వీరిలో కొందరు ఎన్నికల్లో బరిలో దిగుతుంటే, ఇంకొందరు టికెట్ ఆశిస్తున్నారు. మిగతా నటులు ప్రచారానికి సై అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే తారల తళుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా సినీ స్టార్లు ఈ సారి రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలుపుతున్నారు.
వీరిలో కొందరు టికెట్లు దక్కించుకోగా.. ఇంకొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏయే తారలు ఏయే పార్టీలకు మద్దతు ఇస్తున్నారో చూద్దామా!
తెలుగు దేశం: టీడీపీలో మొదటి నుంచి సినీ తారల హవా ఎక్కువే. ఎన్టీఆర్ తనయుడు, కథానాయకుడు బాలకృష్ణ హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు.
ఇటీవల టీడీపీలో చేరిన నటీమణులు వాణి విశ్వనాథ్, దివ్యవాణీలకు టికెట్లు లభించే అవకాశాలు లేకపోవడంతో టీడీపీ తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఈ సారి పోటీ చేయకుండా ఆయన కోడలు రూపను బరిలోకి దింపుతున్నారు. పార్లమెంటులో రోజుకో వేషంతో ప్రత్యేక హోదాపై నిరసనలు వ్యక్తం చేసే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీపీడీ నుంచి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు సినిమాల్లో బిజీగా ఉండటంతో టీడీపీ తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
వైసీపీ: ఈసారి వైసీపీలో తారా బలం పెరిగింది. మొన్నటి వరకు ఆ పార్టీలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే కనిపించేవారు.
ఆవిడకు తోడుగా ఈసారి మరికొందరు తారలు వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు.
వీరిలో ప్రముఖ నటి జయసుధతో పాటు నటుడు బానుచందర్, హాస్య నటులు ఆలీ, పృథ్వీ, కృష్ణుడు, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పోసాని కృష్ణ మురళీలు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.
సినీ నిర్మాత విజయవాడ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విజయవాడ నుంచి పోటీ చేస్తుండగా, రోజా మరోసారి నగరి స్థానం నుంచే బరిలో దిగుతున్నారు.
జనసేన: మిగతా పార్టీలతో పోల్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’లో పేరొందిన తారల సంఖ్య తక్కువగానే ఉంది.
పవన్‌కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు ప్రచారం చేస్తుండగా ‘జబర్దస్త్’ మాజీ టీమ్ లీడర్ షకలక శంకర్, ఆదీలు మద్దతు తెలుపుతున్నారు. పవన్‌కు చిరకాల మిత్రుడైన ఆలీ.. వైసీపీలోకి చేరడం పవర్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
బీజేపీ: ఏపీ బీజేపీ నుంచి ‘నచ్చావులే’ ఫేమ్, నటి మాధవీలత తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనుంది. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు.
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణం రాజు కూడా బీజేపీలోనే ఉన్నా.. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్‌గా లేరు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ‘ఈరోజుల్లో’ ఫేమ్, నటి రేష్మ వైరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.