మరోసారి మసూద్‌కు కొమ్ముకాసిన చైనా.. తీర్మానానికి మోకాలడ్డు

జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ విషయంలో చైనా వైఖరి మారలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తన వీటో అధికారం సాయంతో అడ్డుకుంది.
- 1.మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా మోకాలడ్డు.
- 2.ఐరాస భద్రతా మండలిలో తీర్మానాన్ని అడ్డుకున్న డ్రాగన్.
- 3.బాధ్యతయుతమైన వైఖరిని ప్రదర్శించామని సమర్ధించుకున్న చైనా
జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌పై నిషేధం విధించాలన్న తీర్మానానికి చైనా మరోసారి మోకాలడ్డింది.
మసూద్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ఐరాస భద్రతామండలిలో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డ్రాగన్ అడ్డుకుంది.
సాంకేతిక కారణాలు సాకుగా చూపించి నాలుగోసారి మసూద్‌ను కాపాడింది. తొమ్మిది నెలల కిందట ఇలాగే తన వీటో అధికారాన్ని వినియోగించి మసూద్ నిషేధానికి సాంకేతికంగా అడ్డుపడింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది.
ఈ క్రమంలో వీటో అధికారం కల్గిన ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు ఫిబ్రవరి 27న ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి.
దీనిపై పది రోజుల్లోగా నిర్ణయం ప్రకటిస్తామని ఆంక్షల కమిటీ అప్పట్లో పేర్కొంది. అయితే, చివరి నిమిషంలో తన వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం గమనార్హం.
2009, 2016, 2017లోనూ ఇదే విధమైన వైఖరిని చైనా ప్రదర్శించింది.
చైనా తీరుపై భారత్ ఒకింత అసహనం
చైనా తీరుపై భారత్ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఉగ్రవాది మసూద్ అజార్‌పై అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం నిరుత్సాహానికి గురిచేసిందని భారత్ వ్యాఖ్యానించింది.
ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల ప్రవేశపెట్టిన తీర్మానంపై అభ్యంతరాలను తెలియజేయడానికి భద్రతా మండలి గడువు తేదీని మార్చి 13గా పేర్కొంది.. అయితే, దీనిపై చైనా తన నిర్ణయాన్ని వెల్లడించకుండా నాన్చుడి ధోరణి ప్రదర్శించిందని కేంద్రం తెలిపింది.
అయితే, ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందుకు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలకు ధన్యవాదాలు తెలియజేసింది.
అంతేకాదు, తమ దేశ పౌరులపై జరిగే ఉగ్రదాడులతో సంబంధం ఉన్నవారి విషయంలో పలు అంతర్జాతీయ వేదికలపై నిరంతరం చర్చిస్తూ న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేసింది.
మరోవైపు, చైనా వైఖరిపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఏదిఏమైనా అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని, ఈ విషయంలో చైనా వైఖరి తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత సాధనకు కూడా ఇది గొడ్డలిపెట్టుగా నిలుస్తోందని పేర్కొంది.అయితే దీనికి భిన్నంగా చైనా స్పందించింది.
ఈ విషయంలో తాము బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగిస్తామని, చర్చలు, సంప్రదింపుల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలన్నదే మా అభిమతమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ పునరుద్ఘాటించారు.
ఇటీవలే చైనా విదేశాంగశాఖ సహాయ మంత్రి కాంగ్ జుయాంగ్ పాకిస్థాన్ వెళ్లి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు సైనికాధికారులతోనూ మంతనాలు సాగించారు.