ప్రజలను చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నారు :మోహన్‌బాబు

ఓట్లేసిన ప్రజలనే చంద్రబాబు ఏడిపిస్తున్నాడు: మోహన్‌బాబు

ఓట్లేసి గెలిపించిన ప్రజలనే చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నారని మోహన్‌బాబు అన్నారు. ఆయన అహంకారం పరాకాష్ఠకు చేరిందని, ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

  1. సీఎం చంద్రబాబుపై సినీనటుడు మోహన్‌బాబు ధ్వజమెత్తారు
  2. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఏడిపిస్తున్నాడని మండిపడ్డారు.
  3. ఆయన అహంకారం పరాకాష్ఠకు చేరిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహంకారం పరాకాష్ఠకు చేరిందని అన్నారు సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్‌బాబు.

ప్రభుత్వం తమ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన తిరుపతిలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో కలిసి తిరుపతి-మదనపల్లి మార్గంలో నడిరోడ్డుపైనే బైఠాయించారు. ఈ ఆందోళనలో మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబంటే నాకు చాలా ఇష్టం. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నా విద్యార్థులతో కలిసి పోరాడాను. కానీ ఓటు వేసి గెలిపించిన ప్రజలను నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నాడు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు.

ఆవు-దూడ పథకం కింద గోవులను ఇస్తున్నాడు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేకపోతున్నాడు. అదేంటని అడిగితే అమరావతి కడుతున్నా అంటున్నాడు.

ఆవు-దూడ పథకం యాడ్‌లో ఎద్దును చూపించి ఆవుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎవడి డబ్బుతో ఆవులు ఇస్తున్నాడు.

అది ప్రజల సొమ్ము. దగ్గర దోచుకున్న డబ్బును వాళ్లకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్థులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు.

దీనిపై ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా స్పందించడం లేదు. చంద్రబాబు అహంకారం పరాకాష్ఠకు చేరిపోయింది.

అహంకారం ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ముగుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల జీవితం సువర్ణాక్షరాలతో రాసేలా ఉండాలి.

అలా రాయడానికి నువ్వేమీ సత్య హరిశ్చంద్రుడివి, ధర్మరాజువి కాదు. అవన్నీ నాకు అనవసరం. నా విద్యార్థులకు రావాల్సిన డబ్బులు ఇస్తే చాలు’ అంటూ ధ్వజమెత్తారు మోహన్‌బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed