ప్రజల సొమ్మును ధారాళంగా ఖర్చు చేస్తూ సొంత ప్రచారం చేస్తున్న చంద్రబాబు

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ప్రజాధనంతో సొంత ప్రచారం నిర్వహించుకోవడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచార ప్రకటనల కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించింది.

2015 మే నెలలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ రూ.13.76 కోట్లతో సర్కారు ప్రచార ప్రకటనలు జారీ చేయడం పట్ల కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రకటనల జారీపై సుప్రీం స్పష్టమైన మార్గదర్శకాలు…

‘ప్రకటనల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రజాధనాన్ని వినియోగించరాదు. ప్రభుత్వం బాధ్యతతో పనిచేసేలా మాత్రమే ప్రచార ప్రకటనలు ఉండాలి.

ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార మెటీరియల్‌ ఆబ్జెక్టివ్‌గా ఉండాలి. అధికార పార్టీ ఇమేజ్‌ పెంచేలా, వ్యక్తులకు రాజకీయంగా ఉపకరించేలా ప్రజాధనంతో ప్రచార ప్రకటనలు జారీ చేయరాదు.

న్యాయపరంగా, ఆర్థిక నియంత్రణతో కూడినవిగా ప్రకటనలు ఉండాలి’ అని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని కాగ్‌ తెలిపింది.

అయితే చంద్రబాబు సర్కారు సుప్రీం మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించిందని కాగ్‌ తప్పుబట్టింది.

సీఎం, సీఎంవో ఆదేశాల మేరకే…

సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, టీడీపీ సర్కారుకు అనుకూలంగా ప్రజాధనంతో ప్రచారం నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని సమాచారశాఖ కమిషనర్‌ను ‘కాగ్‌’ లిఖిత పూర్వకంగా కోరింది.

ఈ నేపథ్యంలో సమాచార శాఖ కమిషనర్‌ దీనిపై స్పందిస్తూ చివరి నిమిషంలో ముఖ్యమంత్రితోపాటు ఆయన కార్యాలయం మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తుందని, వాటిని అమలు చేయడం తమ బాధ్యతంటూ వివరణ అందచేశారు.

సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే తాము వ్యవహరించినట్లు అందులో సమాచార శాఖ కమిషనర్‌ పేర్కొన్నారు.

ఈ వివరణపై సంతృప్తి చెందని ‘కాగ్‌’ అసలు సుప్రీం కోర్టు తీర్పు మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఏవైనా ఆదేశాలను జారీ చేశారా? లేదా? ఒకవేళ జారీ చేయకుంటే అందుకు కారణాలను వెల్లడించాలని సమాచారశాఖకు సూచించింది.

సుప్రీం కోర్టు మార్గదర్శకాల అమలుకు కమిటీని ఏర్పాటు చేయలేదని సమాచార శాఖ కమిషనర్‌ వివరణలో పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

వ్యక్తిగత ప్రతిష్ట కోసమే సీఎం దీక్షలు

గత ఏడాది ఏప్రిల్‌ 20వతేదీన తన పుట్టిన రోజు సందర్భంగా జన్మనిచ్చిన భూమి కోసం చంద్రబాబు నిరాహార దీక్ష పేరుతో రూ.1.91 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేశారని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దీక్ష చేశారని, అయితే పూర్తిగా చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకే దీక్ష చేశారని కాగ్‌ తూర్పారబట్టింది.

గత ఏడాది జూన్‌ 30వ తేదీన ‘అంబేడ్కర్‌ ఆశయం.. చంద్రన్న ఆచరణ’ పేరుతో రూ.3.01 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేశారు.

చంద్రన్న ఆచరణ అనడం పూర్తిగా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పెంచడానికేనని, ఈ ప్రకటన సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమేనని కాగ్‌ పేర్కొంది.

గత ఏడాది జూన్‌ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబును పొగుడుతూ ఏకంగా రూ.4.08 కోట్ల ఖర్చుతో సమాచార శాఖ ప్రచార ప్రకటనలు జారీ చేయడాన్ని కాగ్‌ తప్పుబట్టింది.

ఏరువాక పౌర్ణమి పేరుతో రూ. 0.77 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేయడం సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన కిందకే వస్తుందని కాగ్‌ స్పష్టం చేసింది.

గత ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీన ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ఫొటోలతో హోర్డింగుల ఏర్పాటుకు రూ.3.99 కోట్ల ఖర్చు చేయడాన్ని కూడా కాగ్‌ తప్పుబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *