ఆయనొస్తే.. అంతేమరి! నారావారీ పతకాలు!

ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు గుప్పించడం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. అదే ఆయన అసలైన నైజమని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. నాలుగున్నరేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న ఆయన టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను అటకెక్కించారు. ఆ మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశారు. ఓట్ల కోసం తప్పుడు హామీలతో ప్రజలను వంచించడంలో చంద్రబాబు ఆరితేరిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త హామీలతో సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీస్తున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవర త్నాలను మక్కీకి మక్కీ కాపీ చేయడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే భాగంగానే వృద్ధాప్య పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతున్నట్లు ఇటీవల హడావుడిగా ప్రకటించారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి ప్రస్తుతం కుటుంబానికి రూ.2.50 లక్షల వరకు ఉండగా, దాన్ని ఏప్రిల్‌ నుంచి రెట్టింపు చేస్తామని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి మరికొన్ని తాయిలాలు ప్రకటించి, ఓటర్లను బుట్టలో వేసుకోవాలని చంద్రబాబు నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది క్రితం వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే పింఛన్లను గతంలోనే పెంచేవారని, తీరా ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో ఈ హామీ ఇచ్చారంటే ఆయన మోసపూరిత వైఖరిని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

బాబు పాలనలో హామీలన్నీ మాఫీ:

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా, చేనేత రుణాలంన్నిటినీ రద్దు చేస్తామని, రైతులు బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసి, ఆ బంగారాన్ని తిరిగి వారి ఇంటికి చేరుస్తామని, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ (1.42 లక్షలు) భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, అలా ఉద్యోగం రాని వారికి నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా డీఎస్సీ వేసి, టీచర్లను నియమిస్తామని, మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా తొలగిస్తామని, రైతులకు 9 గంటలు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని, పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తామని.. ఇలా అనేక హామీలు ఇచ్చారు.

ఇక కులాల వారీగా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచి, గద్దెనెక్కాక కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. తొలిసంతకం అంటూ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, బెల్టుషాపుల రద్దు హామీలకు అధికారంలోకి వచ్చిన తొలిరోజే వెన్నుపోటు పొడిచారు. వ్యసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి దాన్ని నీరుగార్చారు. పలు షరతులు విధించి, రైతులను దగా చేశారు. రుణమాఫీ అంటూ ప్రభుత్వం ఇచ్చిన అరకొర సొమ్ము ఆ రుణాలపై బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రభుత్వం మోసం చేయడంతో రైతుల రుణ బకాయిలు వడ్డీలు, చక్రవడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయి. అన్నదాతలు అప్పుల ఊబిలో మునిగారు. చివరకు వారికి జీరో వడ్డీ, పావలా వడ్డీ రుణాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరో గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *