చంద్రబాబు ఎపి రుణ కుంభకోణం

రాజధాని అమరావతి పేరుతో గత సర్కారు అందినకాడికి తీసుకున్న అప్పులు నూతన ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను కన్సల్టెంట్లు, వడ్డీల చెల్లింపుల కోసం చంద్రబాబు సర్కారు వ్యయం చేసింది. రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేదు.

అమరావతి బాండ్ల పేరుతో రూ.2,000 కోట్లు అధిక వడ్డీకి అప్పు తీసుకుని అనుత్పాదక కన్సల్టెన్సీలకు రూ.322 కోట్లను చెల్లించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి అథారిటీ నిధి కింద రూ.215 కోట్లు ఉండగా ఇందులో నుంచి రూ.22 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది.

రాజధానిలో సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్ల నుంచి చంద్రబాబు సర్కారు రూ.329 కోట్లను వడ్డీల చెల్లింపులకు వెచ్చించడం గమనార్హం.

విదేశీ, స్వదేశీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సంబంధిత ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. అయితే ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు బాండ్ల ద్వారా అప్పులు చేయాలని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని అప్పట్లోనే పలువురు ఐఏఎస్‌ అధికారులు తప్పుబట్టారు.

ఒకపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి భారీగా సంస్థలు ముందుకు వచ్చాయని, కర్ణాటక కూడా 5.85 శాతానికే అప్పులు చేస్తోందని, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ ఏకంగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ఎలా నిర్ణయిస్తారని అభ్యంతరం తెలిపారు.

బాండ్ల దళారీకి అప్పులో 0.1 శాతాన్ని ఫీజు కింద జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుండగా, అమరావతి బాండ్ల దళారీకి మాత్రం 0.85 శాతం చెల్లించాలని నిర్ణయించడంపై కూడా విస్మయం వ్యక్తమైంది. ఇక అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు ఎంత అప్పు తీసుకుందో అంతకు మించి వడ్డీలు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం గమనార్హం.

అమరావతి బాండ్లకు భారీ వడ్డీ, దళారీ ఫీజుతో కలిపి పదేళ్లలో రూ.2,000.82 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకుని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగటంపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *