చివరికి జర్నలిస్టులు కూడా మోసం చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ

Babu’s 23 Fitting

జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తాం అని చంద్రబాబు చెప్పారు. ఒకొక్కరూ 23 వేలు చెల్లించారు..

ఆ డబ్బు మాకు ఇచ్చేయండి అని కోరుతున్న ఒక జర్నలిస్ట్ …

హౌసింగ్ సొసైటీ అటకెక్కినట్లే..?
చేతులెత్తేసిన సొసైటీ పెద్దలు
ప్రభుత్వ మార్పుతో తలక్రిందులైన పరిస్థితి
డిపాజిట్లు వెనక్కు తీసుకుంటున్న సభ్యులు
జర్నలిస్టుల సొంతింటి ఆశలు ఆవిరి

అంతా అయిపోయింది.. అమరావతి జర్నలిస్టుల సొంతింటి కల ఆవిరైపోయింది. సరైన కార్యాచరణ లేకపోవడంతో పాటు సొసైటీ పెద్దలుగా వ్యవహరించిన కొందరు వ్యక్తుల వ్యవహరశైలితో హౌసింగ్ సొసైటీ అటకెక్కే దుస్థితి దాపురించింది. మరో ఐదేళ్లు ఆగండి.. మా ప్రభుత్వం రాగానే ఇళ్లిప్పించేస్తాం.. అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్న సొసైటీ పెద్దల మాటలను సభ్యులు ఖాతరు చెయ్యడం లేదు. తాము చెల్లించిన సొమ్ము తిరిగిచ్చేయ్యాలని సొసైటీ కార్యాలయానికి సభ్యులు బారులు తీరుతున్నారు.

సొంతిల్లు అనేది ప్రతి మనిషికీ ఓ కల.. అందరిలాగే అమరావతి ప్రాంత జర్నలిస్టులు కూడా సొంతింటి కోసం ఎన్నో కలలు కన్నారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరికీ రాజధాని అమరావతిలో ఇళ్లు కట్టిస్తారనే ఆశతో పెద్దలు స్థాపించిన సొసైటీలో సభ్యులుగా చేరారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతిలో, అందునా జర్నలిస్టు కమ్యూనిటీలో నివసించే భాగ్యం కలుగుతుందని భావించిన జర్నలిస్టులు సొసైటీలో చేరేందుకు పోటీపడ్డారు.

పోటీ అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. సొసైటీలో సభ్యత్వం అంత సులువుగా లభించలేదు కాబట్టి..! సభ్యులుగా చేరేందుకు అవసరమైన అర్హతలతో ఓ కరపత్రాన్ని ముద్రించిన సొసైటీ వ్యవస్థాపకులు ఒక్కో దరఖాస్తుకు రూ.100 చొప్పున వసూలు చేసి అడిగిన వాళ్లందరికీ ఇచ్చిపారేశారు. తొలుత అన్ని జర్నలిస్టు యూనియన్లను కలుపుకువెళ్లినట్లుగా కనిపించినప్పటికీ, కొద్దిరోజుల్లోనే సొసైటీ వ్యవహారం పూర్తిగా కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సొసైటీకి కార్యవర్గాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేసారో ఎవరికీ అంతుపట్టని అంశం.

సాధారణ జర్నలిస్టులకు తెలీదంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ.. యూనియన్ నేతలకు సైతం కార్యవర్గ నియామకంపై కనీస సమాచారం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎవరు చేస్తే ఏంటి.. మనకు ఇల్లొస్తే అంతేచాలు.. అని మిన్నకుండిపోయిన జర్నలిస్టులకు స్క్రూటినీ పేరుతో సొసైటీ పెద్దలు షాకిచ్చారు. వార్ రూమ్ వడపోత అనంతరమే అర్హులుగా తేలుస్తామని, అప్పటికప్పుడు నిర్ధేశించుకున్న ప్రామాణికాలకు సరితూగితేనే సొసైటీలో చోటుదక్కుతుందని జర్నలిస్టులకు ఖరాఖండిగా తేల్చిచెప్పారు. అదేంటి.. అన్ని అర్హతలు పరిశీలించే కదా అప్లికేషన్ తీసుకున్నారు.. ఇంకా ఈ వడపోతలెందుకు.. అని ప్రశ్నిస్తే.. తొందరెందుకు.. మీ నంబర్ వస్తుంది.. అని ఒకింత కఠినంగానే సమాధానం వచ్చేది.

ఓ వైపు ఈ వడపోత ప్రక్రియ కొనసాగిస్తూనే అర్హతలతో నిమిత్తం లేకుండానే అస్మదీయులతో దొడ్డిదారిన డీడీలు తీయించేశారు. తమ పలుకుబడినంతా ఉపయోగించి, అష్టకష్టాలు అనుభవించి ప్రభుత్వం నుండి ఒకటికి రెండుసార్లు జీవోలిప్పించారు కదా..

ఆ మాత్రం స్వేచ్ఛ సొసైటీ పెద్దలకు వుండకూడదా.. అని తమకుతాము సర్దిచెప్పుకున్న జర్నలిస్టులు తమ సొంతింటి స్వప్నం ఛిద్రం కాకూడదని మిన్నకుండిపోయారు. సందేశాలు అందినవాళ్లు అప్పో సప్పో చేసి రూ.23వేలు సొసైటీ ఖాతాకు జమచేయగా, మిగిలివాళ్లు మాత్రం సొసైటీ వారు పంపించే సంక్షిప్త సందేశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రహసనం ఈ విధంగా కొనసాగుతుండగానే.. సీఆర్డీఏకు డబ్బు కట్టేశాం.. ఇక స్థలం స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. అని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో స్వయం ప్రకటిత సొసైటీ పెద్దలకే తెలియాలి. గత ప్రభుత్వ హయాంలో వైభవం వెలగబెట్టిన కొందరు జర్నలిస్టు పెద్దలకు ఈ ప్రభుత్వంలో కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకకపోవడంతో హౌసింగ్ సొసైటీ అటకెక్కే పరిస్థితి దాపురించింది. అమరావతి రాజధానిలాగే అమరావతి హౌసింగ్ సొసైటీ కూడా మిథ్య అని తేటతెల్లం కావడంతో సొంతిల్లు సమకూరుతుందని ఆశపెట్టుకున్న జర్నలిస్టులు వేదన చెందుతున్నారు.

వాస్తవ పరిస్థితిని అందరికీ వివరించి పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన సొసైటీ పెద్దలు ఆ దిశగా ఏ ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఉండటమే తమకు ఇష్టం లేదన్నట్లుగా సొసైటీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది. సర్వ సభ్య సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సివుండగా “ఐదేళ్లు ఆగండి.. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది..” అని వ్యాఖ్యానాలు చేయడం చూస్తుంటే వీరి నిబద్ధతపై సందేహాలు కలగకమానవు.

తమకుతాముగా భుజాలకెత్తుకున్న బాధ్యతను విస్మరించిన సొసైటీ పెద్దలు.. తమ అశక్తతను ఒప్పుకోవడానికి కూడా ముందుకురావడం లేదు. “ఇక ఈ పని మా వల్ల కాదు.. మమ్మల్ని సచివాలయంలో అడుగుపెట్టనివ్వడం లేదు.. సమర్థులెవరైనా ఈ బాధ్యత తీసుకోండి..” అని చెప్పి హుందాగా వ్యవహరించాల్సిన నేతలు సొసైటీని దాదాపు అటకెక్కించేశారు. సొసైటీ వ్యవహారం ముందుకు సాగేలా లేదులే..

రోజులు గడిస్తే మనం కట్టిన డబ్బుకి రెక్కలొచ్చేస్తాయని ఆందోళన చెందుతున్న సభ్యులు మా డబ్బు తిరిగిచ్చెయ్యండి మహాప్రభో..! అంటూ సొసైటీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఐదేళ్లాగండి.. అని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకొని వారికి ఇప్పటికే డీడీలిచ్చిన సొసైటీ సిబ్బంది.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని తమ పెద్దలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *