మరోసారి చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బాబు ఇంటికి మరోసారి నోటీసులు.. వారంలోగా కూల్చేయాలని అల్టిమేటం!

గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట సమీపంలో ప్రజావేదికను నిర్మించిందని పేర్కొంటూ దీని కూల్చివేతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

రాజధాని అమరావతిలోని ప్రజావేదికతో సహా అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ప్రజావేదికను నిర్మించారని పేర్కొంటూ దీనిని జగన్ సర్కారు కూల్చివేసింది.

అలాగే కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు జూన్‌లోనే సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా ఉంది.

తాజాగా, మరోసారి చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నోటీసులు జారీచేసిన అధికారులు.. వారంలోగా అక్రమ కట్టడాలని తొలగించాలని పేర్కొవడం విశేషం.

నిబంధనలకు విరుద్దంగా నదీగర్భంలో ఈ భవనాన్ని నిర్మించారని, అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా తొలగించాలని… లేకపోతే తామే వాటిని తొలగిస్తామని సీఆర్డీఏ జారీచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

గెస్ట్‌హౌస్ యజమాని లింగమనేని రమేశ్ పేరుతో నోటీసు జారీచేసి గురువారం రాత్రి ఆ భవనం గోడలకు అతికించారు.

కృష్ణా నది గరిష్ఠ వరదనీటి మట్టం లోపల భవనాన్ని 1.318 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారని, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, డ్రెస్సింగ్‌రూమ్‌ తదితర నిర్మాణాలన్నింటినీ నియమ, నిబంధనలను అతిక్రమించి చేపట్టారని అందులో వివరించారు.

అనుమతులు లేని ఈ అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని గతంలోనే తాము షోకాజ్‌ నోటీసు జారీచేశామని సీఆర్డీఏ తెలిపింది.

తగిన అనుమతులు ఉన్నాయని, వీటికి సంబంధించిన పత్రాలను సమర్పిస్తామని చెప్పి, నిర్దేశిత గడువులోగా అందజేయలేదని పేర్కొంది.

సీఆర్‌డీఏ కమిషనర్‌కు మీరు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, అందుకే ఈ అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేకపోతే మేమే వాటిని తొలగిస్తామని అల్టిమేటం జారీచేశారు.

2014 ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన చంద్రబాబు..కృష్ణా కరకట్టపై ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేపట్టారు.

కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు అక్రమ కట్టడాలను గుర్తించిన సీఆర్డీఏ అధికారులు వారికి కూడా నోటీసులు జారీచేశారు.

ఇందులో మంతెన సత్యన్నారాయణ రాజు ఆశ్రమయం, గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్ తదితర కట్టడాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *