జగన్ చేతికి విజయాస్త్రాన్ని అందించిన బాబు

రాజధాని రగడ లేకపోయి ఉంటే.. వచ్చే ఎన్నికల్లో నవరత్నాల హామీల అమలే వైసీపీకి ప్రధాన అస్త్రంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అస్త్రాన్ని అనుకోకుండా జగన్ చేతికి అందించారు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి, మూడు రాజధానుల్లో రాబోయే నాలుగేళ్ల కాలంలో జగన్ చేయబోయే అభివృద్ధి.. ఈ రెండిటి మధ్య పోలికే 2024 ఎన్నికల నాటికి డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది.

రాజధానిపై చంద్రబాబు ఇంత రచ్చ చేసి ఉండకపోతే.. ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. జగన్ కూడా పట్టుదలకు పోయి ఉండేవారు కాదు. కానీ అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి, వారిలో అపోహలు సృష్టించి, న్యాయవ్యవస్థను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేసి, చివరకు శాసన వ్యవస్థను కూడా దురుద్దేశాల కోసం వాడుకుని చంద్రబాబు ఇంత సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కాకపోయినా, ఇంకొన్నిరోజులకైనా మూడు రాజధానుల బిల్లు చట్టంకాక మానదు. అలా మారిన తర్వాత జగన్ ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించక మానరు.

తన ఆలోచనే సరైనది అని నిరూపించుకునే కసితో అయినా జగన్ మూడు రాజధానుల విషయంలో రాజీ లేకుండా అభివృద్ధి చేస్తారు. అమరావతిలో ఐదేళ్లలో జరగలేనిది.. వచ్చే నాలుగేళ్లలో చేసి చూపిస్తారు. అటు కర్నూలుకు కోర్టే కదా వచ్చింది, నాలుగు జిరాక్స్ సెంటర్లు ఎక్కువ వస్తాయిలే అనుకునేవారికి కూడా గట్టి సమాధానమే చెప్పబోతున్నారు. న్యాయ వ్యవస్థను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, లోక్ అదాలత్ వంటివాటితో దీర్ఘకాలికంగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం, ప్రత్యామ్నాయ న్యాయ సేవలకు రాయలసీమ కేరాఫ్ అడ్రస్ గా నిలపడం వంటివి ఆయన ఆలోచనలు. వైఎస్ఆర్ లా నేస్తం వంటి కార్యక్రమాలు కూడా ఈ ముందుచూపులో భాగమే.

ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడంతో సెక్రటేరియట్ తో సహా వివిధ శాఖల ప్రధాన కేంద్రాలు కూడా అక్కడికి తరలి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. వీటితో పాటు సమాంతరంగా జోన్ ల వ్యవస్థ కూడా ప్రవేశ పెడతారు కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది. చంద్రబాబు మోకాలడ్డడంతో ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఎక్కువగా ఎలివేట్ అయ్యే అవకాశముంది.

రాబోయే నాలుగేళ్లతో జగన్ తాను చెప్పిన అభివృద్ధిని ప్రజల కళ్లముందుంచితే.. చంద్రబాబు ఆటోమేటిక్ గా అభివృద్ధి కంటకుడిగా మారిపోతారు. ఇలాంటి అభివృద్ధి చేయడం చేతకాని బాబు.. కావాలనే జగన్ నిర్ణయాలకు అడ్డుతగిలారని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది, మరీ ముఖ్యంగా అమరావతి వాసులకి కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో చంద్రబాబు ప్రజాకోర్టులో దోషిగా నిలబడతారు.

మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చంద్రబాబు అడ్డు తగలడం భవిష్యత్తులో టీడీపీకి పెద్ద శాపంగా, వైసీపీకి వరంగా మారబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *