అమెరికాకు సీఎం జగన్ పయనం

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 3.15 గంటలకు రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం ఆయన మాతృమూర్తి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, పలువురు అధికారులతో కలసి సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.

AmericaTour #APCM #YSJagan
ఎయిర్‌పోర్టులో జగన్‌కు మంత్రి పేర్ని నాని, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. కుటుంబీకులతో కలసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాత్రి 7.40కు చేరుకున్నారు. రాత్రి 9.50 నిమిషాలకు వాషింగ్టన్‌కు బయలుదేరారు.
సీఎం అమెరికా పర్యటన వివరాలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. పర్యటనలో మూడు రోజులు వ్యక్తి గత పనులు ఉండటం వల్ల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే భరించనున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ఇలా సాగుతుంది
- ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరతారు. అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా– ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
- ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
- ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
- ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు.
- ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు.
నోట్: పర్యటనలో మూడు రోజులు వ్యక్తి గత పనులు ఉండటం వల్ల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా సొంత ఖర్చుతో ఈ పర్యటన జరుగుతుంది.