రైల్వే జోన్‌పై బాబు సంచలన వ్యాఖ్యలు

విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. గతంలో ఉన్న వాల్తెరు డివిజన్‌ను మూడు భాగాలు చేయడం గమనార్హం.

విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ఎట్టకేలకు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, వాల్తేర్ డివిజన్‌ను మూడు భాగాలుగా చేసి ఒకటి విజయవాడలోనూ రెండింటిని రాయగఢ్‌లోనూ కలుపుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

దీనిపై అధికార టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతలతో గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.

మార్చి 1న విశాఖ పర్యటనకు ప్రధాని వస్తున్నందున విభజన హామీల అమలుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రం రైల్వే జోన్ ప్రకటన మసిపూసిన మారేడుకాయ చందంగా ఉందని, ఎక్కువ ఆదాయానికి గండికొట్టి, తక్కువ మొత్తంలో వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు.

విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరో మోసమని, బీజేపీ మోసాన్ని అందరూ ఖండించాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

కార్గో రాబడి ఒడిశాకిచ్చి.. ప్యాసింజర్ రాబడి ఏపీకిచ్చి, రాష్ట్రానికి రూ.7వేల కోట్ల ఆదాయాన్ని పోగొట్టారని మండిపడ్డారు.

ఉద్యోగ నియమాకాల్లోనూ ఒడిశాకే ఎక్కువ లాభం చేకూరుతుందని, ఎవరిని మోసం చేయాలని ఈ ప్రకటన చేశారని కేంద్రాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో ఉన్న స్టేషన్లనూ విశాఖ జోన్‌కు కేటాయించలేదని, దీనికి నిరసనగా గురువారం సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.

శుక్రవారం నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని, హామీలన్నీ నెరవేర్చాకే ఏపీలో అడుగుపెట్టాలని ఉద్ఘాటించారు.

రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ సంబరపడుతోందని, చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఈ అంశాలన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీల సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.

ఇన్నాళ్లూ రాజధానిని తరలించాలనే కుట్రలతో వైసీపీ ఉందని.. ఇప్పుడు అభివృద్ధి చూసి ఏమీ చేయలేక దానిని తరలించబోమని చెప్తోందని మండిపడ్డారు.

అమరావతిలో బుధవారం గృహ ప్రవేశం చేసిన మర్నాడే హైదరాబాద్ పయనమయ్యారని..రాష్ట్రంలో ఆయన నిలకడగా నివాసం ఉండరని మండిపడ్డారు. జగన్‌కు నిలకడ, విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *