మోదీ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా బదులిచ్చారు…

పవన్‌తో రెండేళ్ల ముందే, మీ దేశభక్తి అదే: మోదీకి బాబు ఘాటు రిప్లయ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా బదులిచ్చారు.

నల్లచొక్కా వేసుకొని మాట్లాడిన ఆయన మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాది యూటర్న్ కాదు రైట్ టర్న్ అని తెలిపారు.

విశాఖపట్నం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కౌంటర్ వేశారు.

విజయవాడలో మాట్లాడిన ఆయన.. పుల్వామా దాడి ఘటన తర్వాత రాజకీయాలు చేశారు, అదీ మోదీ దేశభక్తి అని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టమన్నాం.

కానీ మోదీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ పార్లమెంట్ మమ్మల్ని గురించి చర్చించలేదు. కర్ణాటకలో 22 సీట్లు గెలుస్తామన్న యడ్యూరప్ప గురించి చర్చించారు. ఎన్నికల లబ్ధి కోసం దాడి చేస్తున్నారని పాక్ పార్లమెంట్‌లో చర్చించారని మోదీకి చురకలు అంటించారు.

‘ఎన్నికలకు ముందే పాకిస్థాన్‌తో యుద్ధం వస్తుందని రెండేళ్ల ముందే పవన్ కళ్యాణ్‌‌తో చెప్పారంటే ఏం అర్థం చేసుకోవాలి..? మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విమర్శించారు.

అసమర్థులు కాబట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను దేశభద్రతతో ముడిపెట్టొద్ద’ని బాబు సూచించారు. అవసరమైతే ప్రాణాలు ఫణంగా పెట్టుకొనైనా దేశాన్ని కాపాడుకుంటామన్నారు.

నన్ను విమర్శించడానికి మోదీ వచ్చారు. ఆయన మనకు ఇచ్చిందేమిటి? అని చంద్రబాబు నిలదీశారు. వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఇవ్వడాన్ని మోదీ మాయాజాలంగా ఆయన అభివర్ణించారు.

హుదూద్ పరిహారంగా రూ.1000 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రధాని రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. అదే గుజరాత్‌కైతే మరింత ఎక్కువగా ఇచ్చేవారని విమర్శించారు.

ప్రజల కోసం, భావితరాల కోసం శ్రమిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. కుటుంబ పాలన అంటున్నారు. అసలు ఈయనకు కుటుంబం ఉంటే కదా అని మోదీని ఎద్దేవా చేశారు.

35 ఏళ్ల క్రితమే నేను భయపడలేదు, ఇప్పుడేం భయపడతాను. తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదు. తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో 1983లోనే చూపించాం. మీరు బెదిరిస్తున్నారు. భయపెట్టాలని చూపిస్తున్నారు.

మావాళ్లపై ఐటీ, ఈడీలతో దాడులు చేస్తున్నారు. అవసరమైతే ఇంకో సినిమా చూపిస్తాం. కానీ భయపడం అని బాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం ప్రాణం పోయినా ఫర్వాలేదు.

ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతాం. మోదీ ఒక్కటైనా నిజం చెప్పలేదు. ఎవరి భండారం ఏంటో త్వరలోనే బయటపెడుతుందని మోదీ గుర్తుంచుకోవాలి. పరిపాలన చేతగానిది మాకు కాదు, మీకని మోదీని నిలదీశారు.

మీరు 13 ఏళ్లు అహ్మదాబాద్‌లో సీఎంగా ఉన్నారు. నేను 9 ఏళ్లే హైదరాబాద్‌లో సీఎంగా ఉన్నా. రెండు నగరాల మధ్య పోలిక ఉందా? చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా అని ప్రశ్నించారు.

మోదీ సభ పేరు సత్యమేవ జయతే అని పెట్టారు. అది అసత్యమేవ జయతే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాల్లో ఒక్కటైనా అయ్యిందా? ఐదేళ్లలో ఏం చేశారు? బలహీనమైన పీవీ సర్కారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.

దేశానికి దశా దిశా చూపించారని బాబు గుర్తు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలే మెరుగైన పాలన అందించాయన్నారు. మీకు సంపూర్ణ మెజార్టీ ఇస్తే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

ప్రధాని ఎంత బలంగా ఉంటాడని కాదు, ఎంత బలమైన నిర్ణయాలు తీసుకుంటాయనేదే ముఖ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed